ఏపీ గవర్నర్‌కు నారా లోకేష్ లేఖ: రీకాల్ కోసం డిమాండ్: ఆ రెడ్డి టార్గెట్
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఈ లేఖను రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉన్న సమయంలో నారా లోకేష్ ఈ లేఖ రాశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ను రీకాల్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
రాజకీయాలకు అతీతంగా పని చెయాల్సిన విశ్వవిద్యాలయాల వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని నారా లోకేష్ విమర్శించారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చేలా అక్కడి వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తోన్నారని ఆరోపించారు. నిత్యం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని, నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోన్నారని ధ్వజమెత్తారు. తక్షణమే పీవీజీడీ ప్రసాద్ రెడ్డి రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. 2020లో ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచీ ఆయన అనేక అక్రమాలు, దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియామకాల్లో అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు. ప్రింటింగ్ ప్రెస్‌ను మూసివేయించారని, యునివర్శిటీ గ్రాంట్ కమిషన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి విద్యావేత్తలు పని చేసిన ఆంధ్రా యూనివర్శిటీ విశ్వవిద్యాలయం ఇప్పుడు రాజకీయ నాయకులకు పునరావాసంగా మారిందని చెప్పారు. కులాల ఆధారంగా అక్కడ నియామకాలు చేపడుతున్నారని విమర్శించారు. తన కులానికి చెందిన వారికి ఇష్టానుసారంగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారని ఆరోపించారు. వైస్ ఛాన్సలర్‌ను వెంటనే రీకాల్ చేయాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కోరారు.












Click it and Unblock the Notifications