జగన్ ను కలిసిన టీడీపీ సీనియర్ నేత..!!
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తోన్నారు.
ఈ క్రమంలో- పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతోపాటు, రీజినల్ కో- ఆర్డినేటర్లు ఇందులో పాల్గొన్నారు.

టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలు, ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం, పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై సాగుతున్న దాడులపై సమావేశంలో చర్చిస్తున్నారు. సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది.
ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీకి బిగ్ బూస్ట్ లభించింది. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లోకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం ఆ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా ఆహ్వానించారు జగన్.
టీడీపీ కూటమి అధికారంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పార్టీని వీడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నమయ్య రాయచోటి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని మరో నేతకు అప్పగించడం, తన వర్గీయులను నిర్లక్ష్యం చేస్తోండటం వంటి పరిణామాలు సుగవాసి మనస్తాపానికి కారణం అయ్యాయని అంటున్నారు.
తన తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు మరణించిన సమయంలో టీడీపీ తరఫున ఒక్క నాయకుడు కూడా అంత్యక్రియలకు హాజరుకాలేదనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఉంది. దీనితో టీడీపీతో నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన అనుబంధాన్ని తెంచుకున్నారని చెబుతున్నారు.
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, జడ్పీటీసీ సభ్యుడిగా పని చేశారు సుగవాసి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి టీడీపీ అగ్ర నాయకత్వం ఆయనను నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని చెబుతున్నారు.
దీనితో ఆయన టీడీపీ గుడ్ బై చెప్పారు. తాజాగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. వైఎస్ఆర్సీపీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా అన్నమయ్య రాయచోటి, కడప జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.












Click it and Unblock the Notifications