వక్ఫ్ బిల్లుకు మద్దతు ఎఫెక్ట్-టీడీపీలో మొదలైన రాజీనామాలు..!
పార్లమెంట్ లో కేంద్రం తాజాగా ప్రవేశపెట్టి ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, లోక్ జన్ శక్తి వంటి పార్టీలు మద్దతుగా నిలిచాయి. దీంతో పార్లమెంట్ లోని లోక్ సభ, రాజ్యసభల్లోనూ ఈ వివాదాస్పద బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. అయితే ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన ఎన్డీయే మిత్రపక్షాలకు ఇప్పుడు సొంత పార్టీల్లో తలనొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే బీహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు మైనార్టీ నేతలు గుడ్ బై చెప్తుండగా.. ఇప్పుడు ఏపీలోనూ టీడీపీకి ఇవాళ ఓ మైనార్టీ నేత గుడ్ బై చెప్పేశారు.
గత ఎన్నికల్లో విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని గెలుపు కోసం పనిచేసిన వాజిద్ ఖాన్ అనే మైనార్టీ నేత ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. గతంలో చంద్రబాబు పాలనా దీక్షను చూసి తాను టీడీపీలో చేరానని, గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయం కోసం పనిచేశానని వాజిద్ ఖాన్ తన రాజీనామా లేఖలో తెలిపారు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడం తనను మనస్తాపానికి గురి చేసినట్లు ఆయన తెలిపారు.

మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం పార్లమెంట్ లో ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడంపై మనస్తాపానికి గురైన తాను ఓ మైనార్టీ నేతగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వాజిద్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ ఆఫీసుకు పంపినట్లు తెలుస్తోంది. ఇదే లేఖను మీడియాకు విడుదల చేసారు. దీంతో వక్ఫ్ బిల్లుకు మద్దతు ప్రభావం టీడీపీపైనా రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications