అందరి లెక్కలు తేలుస్తాం: యరపతినేని
పల్నాడు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. బ్రహ్మనాయుడు, నాగమ్మ కాలం నుంచి తాజాగా టీడీపీ, వైసీపీ వరకు ఎప్పుడూ చల్లారలేదు. తాజాగా ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు మాటల యుద్ధం చేస్తున్నారు. దీంతో ఇక్కడి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించబోతోందని కేంద్రంలో ఉన్న పెద్దలకు కూడా తెలిసిపోయిందని, అదే విషయాన్ని ముఖ్య మంత్రి జగన్ కు అమిత్ షా చెప్పి పంపించారన్నారు. మాచర్లలో పిన్నెల్లి సోదరులు అరాచకాలకు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, వారంతా కొదమ సింహాల్లా మారతారని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో మాచర్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి 20వేల భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని యరపతినేని జోస్యం చెప్పారు. సొంత పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన చరిత్ర పిన్నెల్లి సోదరులదని యరపతినేని మండిపడ్డారు. తాను, జూలకంటి సొంత అన్నదమ్ములు కాకపోయినా పల్నాడు ప్రాంతంలో అంతకుమించిన సోదర భావంతో పనిచేస్తున్నామన్నారు. పల్నాడులో తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించిన ప్రతి పోలీసు చరిత్ర రాస్తున్నామని, రాబోయే కాలంలో వారందరికి లెక్కలు అప్పజెబుతామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications