జగన్ బిచాణా ఎత్తేస్తే: టిడిపి, హోదా ఇవ్వాల్సిందే.. మోడీకి కళా
కర్నూలు/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష పైన ఏపీ టిడిపి నేతలు మండిపడుతున్నారు. టిడిపి ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిలు మంగళవారం నాడు నిప్పులు చెరిగారు.
జగన్ దీక్ష రాజకీయ లబ్ధి కోసమేనని కళా వెంకట్రావు అన్నారు. జగన్ కర్నూలులో జలదీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఐదుగురు వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని, మిగిలిన వారిని కాపాడుకోవటానికి జగన్ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

త్వరగా కర్నూలు నుంచి బిచాణా ఎత్తేస్తే అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రాయలసీమను రతనాల సీమ చేసే విధంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే, జగన్ మాత్రం పదే పదే సీమ ఎడారవుతుందని మాట్లాడుతున్నారన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని గుర్తు చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవటానికి తమ వద్ద పక్కా ప్రణాళికలు ఉన్నాయని, వాటిని ముందుగానే తెలియజేస్తే అప్రమత్తమవుతారని చెప్పారు.
అదే సమయంలో ప్రత్యేక హోదా, విభజన హామీల పైన కూడా కళా వెంకట్రావు, మంత్రి అయ్యన్న పాత్రుడులు మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం హోదా ఇవ్వాల్సిందేనని చెప్పారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే కేంద్రం ఏపీకి నిధులు ఇస్తోందని విమర్శించారు. హోదా ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications