ఐనా మారలేదు, నీ ఖర్చెంత: జగన్‌పై దుమ్మెత్తి పోశారు
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరు కానని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం దుమ్మెత్తి పోశారు. టిడిపి నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దూళిపాళ్ల నరేంద్ర, కోడెల శివప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత పైన నిప్పులు చెరిగారు.
రుణమాఫీ పైన జగన్ తీరు అహంకారపూరితమని సోమిరెడ్డి అన్నారు. రుణమాఫీ పైనే చంద్రబాబు తొలి సంతకం చేస్తారన్నారు. చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి జాతీయస్థాయి నాయకులను పిలవడం వెనుక సదుద్దేశ్యముందని చెప్పారు. ఎపి కొత్తగా ఏర్పడినందున అభివృద్ధి చెందాల్సి ఉందని, జాతీయ స్థాయిని ఆకట్టుకోవాల్సి ఉందని, రాజధాని కూడా లేనందున అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని... అందుకే జాతీయ నాయకులను పిలిచామన్నారు. ఎపికి గుర్తింపు కోసమే బాబు ప్రయత్నాలన్నారు.

జగన్ జైలు నుండి బయటకు వచ్చినప్పుడు నాలుగు గంటల ఊరేగింపుకు ఎంత ఖర్చయిందో చెప్పాలన్నారు. ఓదార్పు యాత్రకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. ఎల్బీ స్టేడియంలో వైయస్ ప్రమాణ స్వీకారం హంగామా గుర్తుకు లేదా అన్నారు. ప్రజల తీర్పును గౌరవించని ఏకైక నాయకుడు జగన్ అన్నారు. ప్రమాణ స్వీకారానికి రానని చెప్పడం ఆయన దురహంకారమన్నారు.
చంద్రబాబు చెప్పిన మాట చేసి తీరుతారన్నారు. చంద్రబాబు పైన ప్రజలకు నమ్మకం ఉందని చెప్పారు. వైయస్ ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. వందల కోట్ల ప్రజాధనంతో భవంతులు నిర్మించి, ఓదార్పు కోసం కోట్లు ఖర్చు చేసి ప్రజా ధనం దుర్వినియోగం చేసిన జగన్ మాట్లాడటం విడ్డూరమన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానంటే అంత అక్కసు ఎందుకన్నారు.
బాబు జగన్‌లా రాజప్రసాదాల కోసం లక్ష కోట్ల రూపాయలు దండుకోవడం లేదని, రుణమాఫీ చేస్తున్నారన్నారు. రైతు రుణమాఫీలో షరతులు పెడితే ఆ డబ్బు కూడా వారి సంక్షేమానికే ఖర్చు పెడతారన్నారు. బాబు రైతు రుణమాఫీ చేయలేరంటూ అపశకునాలు పలకడం ఎంత వరకు సమంజసమన్నారు. రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఇప్పటికీ పార్టీ నుంచి అందరూ ఎగిరిపోతున్నారని, మిగిలిన నాయకులు వేరే పార్టీ మారకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
బహిరంగ సభకు ఎంత ఖర్చవుతుందో తెలియని దుస్థితిలో జగన్ ఉన్నారని దూళిపాళ్ల మండిపడ్డారు. కాబోయే ముఖ్యమంత్రి రమ్మని స్వయంగా ఆహ్వానిస్తే, రానని చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. జగన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదన్నారు. ప్రజాధనం వృధా గురించి జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు. ప్రమాణానికి రూ.3 కోట్ల ఖర్చును ముప్పై కోట్లుగా చెబుతున్నారన్నారు. రాజధాని లేని రాష్ట్రంలో చంద్రబాబు బాధ్యతలు చేపడుతున్నారని, రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేందుకు జాతీయ నాయకులను ఆహ్వానించామని కోడెల చెప్పారు.












Click it and Unblock the Notifications