ధర్మవరం టీడీపీ అభ్యర్ధి ఖరారు - హోరా హోరీ..!!
రానున్న ఎన్నికలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నవ్ ఆర్ నెవర్ గా ప్రకటించారు. ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. ఇప్పటికే కొన్ని సీట్లకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ..మరి కొన్ని నియోజకవర్గాల్లో ఆచి తూచి వ్యవహరిస్తోంది. జనసేనతో పొత్తు వేళ సీట్ల కేటాయింపు పైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి ఈ సారి పరిటాల కుటుంబం రెండు సీట్లపైన ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలో ధర్మవరం సీటు పైన నిర్ణయం జరిగింది. టీడీపీ అభ్యర్ధి ఖరారయ్యారు.
ధర్మవరం నుంచి శ్రీరామ్: ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీకి పట్టుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరుపున గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ధర్మవరం నుంచి గెలిచారు. అయితే 2019లో ఓటమి పాలయిన తర్వాత తనకున్న సమస్యల దృష్ట్యా ఆయన బీజేపీలో చేరారు. దీంతో ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కు చంద్రబాబు అప్పగించారు.

తొలుత అయిష్టంగానే బాధ్యతలను తీసుకున్న శ్రీరామ్ తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో తన పట్టును పెంచుకునే ప్రయత్నం గత కొంతకాలంగా చేస్తున్నారు. తరచూ పర్యటిస్తూ తనకంటూ ప్రత్యేక క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి ధర్మవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పరిటాల కుటుంబానికి కొంత గ్రిప్ ఉండటంతో ఈసారి అక్కడి నుంచి పోటీ చేసి శాసనసభలోకి అడుగు పెట్టాలని శ్రీరామ్ భావిస్తున్నారు.
ఖరారు చేసిన లోకేశ్: 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన శ్రీరామ్ ఓడిపోయారు. రాప్తాడు నుంచి 2009,2014లో పరిటాల సునీత గెలుపొందారు. 2019 ఎన్నికల్లో శ్రీరామ్ కు సీటు కేటాయించారు. వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆ ఎన్నికల్లో 25,275 ఓట్లతో గెలుపొందారు. ఈ సారి తిరిగి సునీత రాప్తాడు నుంచి..శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేసేందుకు చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ధర్మవరంలో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వరదాపురం సూరి పైన వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 15,666 ఓట్లతో గెలిచారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సూరి బీజేపీలో చేరారు. తిరిగి వచ్చే ఎన్నికల్లోగా బీజేపీతో పొత్తు ఉంటే అదే పార్టీ..లేకుంటే టీడీపీలో చేరి తిరిగి పోటీ చేసేందుకు సూరి ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. శ్రీరామ్ పరోక్షంగా సూరి పైన వ్యాఖ్యలు చేసారు. ధర్మవరం సీటు కోసం ఎవరు ప్రయత్నం చేసినా టికెట్ తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేసారు.
శ్రీరామ్ అభ్యర్ధని తేల్చిన సునీత: టీడీపీ నేత నారా లోకేశ్ సైతం ధర్మవరంలో పాదయాత్ర సమయంలో పరిటాల శ్రీరామ్ పార్టీ అభ్యర్ధిగా వెల్లడించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పరిటాల శ్రీరామ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు కేతిరెడ్డి. గ్రౌండ్ వర్క్ చేసుకో, వాస్తవాలు ఏంటో తెలుసుకో, ఎవరో చెప్పినవి వినద్దు అంటూ సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా పరిటాల సునీత ధర్మవరం సెక్షన్ ఇంఛార్జ్ ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు.
ధర్మవరం టికెట్ శ్రీరామ్ కే వస్తుందని తేల్చి చెప్పారు. మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకే సునీత ఈ ప్రకటన చేసారని భావిస్తున్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ వర్సస్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మధ్య హోరా హోర పోరు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications