టీడీపీకి మరో గవర్నర్ పదవి - చంద్రబాబు ఛాయిస్ ఆయనేనా ..!?
ఏపీ కేంద్రంగా ఢిల్లీలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు డిసైడ్ అయింది. త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోదీ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా గవర్నర్లను ఖరారు చేస్తున్నారు. టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రధాని మోదీ రాజకీయంగా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్లు - డీలిమిటేషన్ బిల్లుల ఆమోదానికి తుది కసరత్తు జరుగుతోంది. ఆ తరువాత కేంద్ర కేబినెట్ ప్రక్షాళన దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత కేబినెట్ లో కొందరికి పార్టీ పదవులు కేటాయించనున్నారు. కొందరికి గవర్నర్లుగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీకి మరో గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

కాగా.. కేంద్ర కేబినెట్ లో టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. అదే విధంగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. ఇదే సమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవి పైన హామీ దక్కినట్లు తెలుస్తోంది. టీడీపీకి మరో గవర్నర్ పదవి పైన టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది కీలకంగా మారుతోంది.
ఇప్పటికే టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కింది. ఈ నిర్ణయం వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావటంతో పాటుగా వివాద రహితుడు.. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్ లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతి రాజు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, బీసీ - ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవి పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత యనమల సైతం ఈ రేసులో ప్రము ఖంగా ఉన్నా .. ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పించే అవకాశం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
దీంతో.. రాయలసీమ కు చెందిన బీసీ నేతకు ఇస్తారనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ లో పని చేసి.. ఆ తరువాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ క్రిష్ణమూర్తి పేరు తెర మీదకు వచ్చింది. అయితే.. ఆయన వయో భారం కొందరు ప్రస్తావిస్తున్నారు. దీంతో.. బీసీ లేదా ఎస్సీ వర్గం నుంచి ఉత్తరాంధ్ర మహిళకు ఇస్తారని తాజాగా చర్చ సాగుతోంది. దీంతో.. చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications