TDP Mahanadu: పసుపు పండుగపైనే అన్నిపార్టీల ఫోకస్; అప్పుడే ఏపీలో ఎన్నికల మూడ్!!
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు రాజమండ్రి వేదికగా ప్రారంభమైంది. రాజమండ్రిలో నిర్వహించే పసుపు పండుగకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో హాజరయ్యారు. ఈసారి గోదావరి తీరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు ఉత్సాహంగా సాగుతుంది. ఈ మహానాడు ద్వారా ఎన్నికల శంఖారావాన్ని చంద్రబాబు పూరించనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి తెలుగుదేశం పార్టీ మహానాడు పైన కేంద్రీకృతమైంది.
వచ్చే ఎన్నికలకు చంద్రబాబు ఏం చేయబోతున్నాడు? వచ్చే ఎన్నికల పొత్తులపై చంద్రబాబు ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది? ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఏమి దిశానిర్దేశం చేయబోతున్నారు? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఈ మహానాడులో దొరకనుంది. దీంతో ఏపీ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల దృష్టి ప్రస్తుతం ప్రధానంగా మహానాడు పైనే ఉంది.

ఇటు తెలుగు తమ్ముళ్ళు కూడా ఎన్నికలకు ముందు చివరి మహానాడు కావడంతో చంద్రబాబు ఏం చెబుతారో అన్న దాని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం నిర్వహిస్తున్న మహానాడు ఎన్నికలకు సంబంధించి నిర్ణయాలతో సాగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 15 తీర్మానాలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆరు తీర్మానాల తోపాటు, పలు కీలక ప్రకటనలను పార్టీ అధిష్టానం మహానాడు వేదికగా చెయ్యనుంది.
మహానాడులో తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికల పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని, తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల ప్లాన్ ను, రూట్ మ్యాప్ ను స్పష్టం చేస్తుందని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి, బిజెపి, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు ప్రతి ఒక్కరూ చంద్రబాబు తీసుకునే నిర్ణయాల మీద, మహానాడు వేదికగా చేసే ప్రకటనల మీద ఫోకస్ పెట్టారు.
వచ్చే ఎన్నికలలో ఏ విధంగానైనా మళ్లీ అధికారంలోకి రావాలని శతవిధాల ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు చంద్రబాబు మహానాడును జాగ్రత్త గమనిస్తున్నారు. చంద్రబాబు వ్యూహాలను బట్టి ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకొని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు జరగనున్న టిడిపి మహానాడు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచి ఏపీలో ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications