హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే అనితను రోజా ఏమన్నారు?: బాబు గురించి ఇప్పుడు తెలిసింది!

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నాలుగు రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పైన రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసేంత కఠిన చర్యలు తీసుకున్నారంటే ఆమె ఎంతటి పెద్ద మాటలు మాట్లాడారోననే చర్చ సాగుతోంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువగా కాల్ మనీ - సెక్స్ రాకెట్, రోజా సస్పెన్షన్ అంశం పైనే కనిపించింది. మొదటి రోజు నుంచి సమావేశాలు హాట్‌హాట్‌గానే సాగాయి. తొలి రోజే అధికార పక్షం... అంబేడ్కర్ పైన చర్చ అని చెప్పగా, విపక్షమైన వైసిపి కాల్ మనీ - సెక్స్ రాకెట్ పైన చర్చకు పట్టుబట్టింది.

కాల్ మనీ - సెక్స్ రాకెట్ అంశం పైన అసెంబ్లీ ఎక్కువగా వాయిదా పడింది. అంబేడ్కర్ పైనే మొదట చర్చకు వైసిపి ససేమీరా అనడంతో ఆ పార్టీ సభ్యులను సస్పెండ్ చేసి అధికార పార్టీ దానిని పూర్తి చేసింది. ఆ తర్వాత కాల్ మనీ పైన చర్చించాయి.

TDP members demand suspension of Roja for the rest of her tenure

కాల్ మనీపై చర్చ సమయంలో విపక్షం... చంద్రబాబును, టిడిపిని తప్పుబట్టాయి. అయితే, కాల్ మనీలో టిడిపి, వైసిపి, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల వారు ఉన్నారని, కాల్ మనీ కూడా కొత్తదేం కాదని దశాబ్దాలుగా ఉందని టిడిపి కౌంటర్ ఇచ్చింది.

అంతకుముందు కెమెరాలకు అడ్డుపడ్డారని ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేల పైన రెండు రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత శుక్రవారం నాడు రోజా సస్పెన్షన్ నేపథ్యంలో శాసన సభ మరింత వేడెక్కింది. రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి సునిత పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారంటున్నారు.

అందుకే ఆమె పైన ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు. రోజా సస్పెన్షన్‌ను వైసిపి తప్పుబడుతోంది. ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యేంత తప్పు రోజా చేయలేదని జగన్ సహా ఆ పార్టీ సభ్యులు చెబుతున్నారు. అయితే, రోజా చేసిన వ్యాఖ్యలకు ఏడాది కాదు... అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకుండా వేటు వేయాలని అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రోజా ఎంత దారుణ వ్యాఖ్యలు చేశారనే దానిపై చర్చ సాగుతోంది.

రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయడాన్ని బిజెపి శాసన సభ్యుడు విష్ణు కుమార్ రాజు శుక్రవారం నాడు సభలోనే తప్పుబట్టారు. అయితే, సభ రికార్డులు చూశాక.. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. రోజా చేసిన వ్యాఖ్యలకు ఏడాది సస్పెన్షన్ వేటు సబబేనని, ఆమె అంతటి ఘాటు వ్యాఖ్యలు చేశారని తొలుత తనకు తెలియదని చెప్పారు.

సభలో తెలుగుదేశం, లోటస్ పాండులో వైసిపి

మంగళవారం నాడు సభలో టిడిపి వారు, లోటస్ పాండులో వైసిపి సభ్యులు పరస్పరం నిప్పులు కురిపించుకున్నారు. సభలో మహిళా ఎమ్మెల్యేలు, ఇతర టిడిపి సభ్యులు మాట్లాడుతూ... రోజా మహిళా రౌడీలా వ్యవహరిస్తున్నారని, ఆమె చేసిన వ్యాఖ్యలకు జీవితాంతం పోటీ చేయకుండా వేటు వేయాలని డిమాండ్ చేశారు.

రోజా వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. దళిత మహిళ అయిన అనిత పట్ల దారుణంగా మాట్లాడిన రోజాకు మద్దతు పలికిన జగన్ కూడా దళిత వ్యతిరేకి అన్నారు. దళితుల పైన జగన్‌కు ప్రేమ ఉంటే రోజాను తన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, లోటస్ పాండులో వైసిపి ఎమ్మెల్యేలు రోజా, ఉప్పులేటి కల్పనలు కూడా అధికార పార్టీ పైన, చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఎవరికీ లేని ఆంక్షలు తనకే ఎందుకని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు గురించి అందరూ చెబుతుంటే ఏమో అనుకున్నానని, ఇప్పుడు అర్థమవుతోందన్నారు.

ఎన్టీఆర్‌నే ఏడిపించారంటే తెలుగుదేశం పార్టీ వారు ఎంతటి రాక్షసులో అర్థమవుతోందని, మహిళలను ఏడిపిస్తే చంద్రబాబు నాశనం అవుతారని రోజా శాపనార్థాలు పెట్టారు. అసెంబ్లీ టీడీపీ కార్యాలయంలా మారిందని తీవ్రవ్యాఖ్య చేశారు. ఇదిలా ఉండగా, స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టాలని వైసిపి నిర్ణయించడం గమనార్హం.

English summary
TDP members demand suspension of Roja for the rest of her tenure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X