కోట వినుత డ్రైవర్ హత్యలో తన పాత్రపై తేల్చేసిన బొజ్జల సుధీర్..!
ఏపీలో శ్రీకాళహస్తికి చెందిన జనసేన మహిళా నేత కోట వినుత డ్రైవర్ హత్య కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. సొంత డ్రైవర్ ను భర్త చంద్రబాబుతో కలిసి హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వినుతను జనసేన పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబును అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు జైలుకు పంపారు. అంతే కాదు విచారణలో కోట వినుత ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నోరు విప్పారు. కోట వినుత డ్రైవర్ రాయుడు హత్యకు తానే కారణమంటూ ఆమె చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని బొజ్జల స్పష్టం చేశారు. డ్రైవర్ రాయుడు హత్యే కాదు, కోట వినుతతో విభేదాల విషయంలోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని దేవుడి సన్నిధిలోనే చెప్తున్నట్లు బొజ్జల వెల్లడించారు. దేవుడు, కుటుంబం సాక్షిగా ఈ విషయం చెప్తున్నానన్నారు.

మరోవైపు ఇప్పటికే పోలీసుల విచారణలో కోట వినుత ఈ వ్యవహారం వెనుక బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తన బెడ్ రూమ్ వీడియోలు చిత్రీకరించిన డ్రైవర్ రాయుడిని తన భర్త చంద్రబాబుతో కలిసి చిత్రహింసలకు గురిచేసినట్లు మాత్రం ఆమె అంగీకరించినట్లు సమాచారం. అయితే హత్య మాత్రం చేయలేదని ఈ దంపతులు చెబుతున్నారు. అయితే హత్య ఎవరు చేశారన్న దానిపై చెన్నై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
బొజ్జల సుధీర్ రెడ్డి తనకు రాజకీయ ప్రత్యర్థి అయిన జనసేన నేత కోట వినుతను టార్గెట్ చేసి ఆమె బెడ్ రూమ్ లో డ్రైవర్ రాయుడు సాయంతో కెమెరాలు పెట్టించి ప్రైవేటు వీడియోలు తీయించి వైరల్ చేయించారని, దీనిపై తాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు కూడా చేసానని, దీనిపై చంద్రబాబుతో మాట్లాడతానని చెప్పి పట్టించుకోకుండా వదిలేశారని కూడా అరోపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై జనసేన మాత్రం నోరు మెదపడం లేదు. కోట వినుతను సస్పెండ్ చేసి వదిలేసింది.












Click it and Unblock the Notifications