కొలికపూడి మరో రచ్చ..! పోలీసులకు గంజాయి లింక్స్..?
ఏపీలో గతేడాది ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి సర్కార్ కు నిత్యం తలనొప్పులు తెచ్చే ఎమ్మెల్యేల్లో తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గంలో పలు విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుని వివాదాలు కొని తెచ్చుకున్న కొలికపూడి గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే తాజాగా మరోసారి ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు.
తిరువూరు పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యేల కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. తిరువూరులో పోలీసులు లంచాలు తీసుకుని గంజాయి బ్యాచ్ కు సహకరిస్తున్నారంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తిరువూరు ఎస్సై సత్యనారాయణ గంజాయి అమ్మే వారి దగ్గర, కొనే వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బహిరంగంగానే కొలికపూడి ఆరోపించారు. స్టేషన్లోనే ఎస్సై ప్రైవేట్ పంచాయితీలు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనేందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

తాజాగా ఎస్సై సత్యనారాయణ ఓ వ్యక్తిని గంజాయి అమ్ముతున్నాడని స్టేషన్ కు పిలిపించి, మరో వ్యక్తికి ఫోన్ చేసి అతని నుంచి డబ్పులు డిమాండ్ చేసినట్లు కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బాధిత కుటుంబం బంగారు తాకట్టు పెట్టి ఎస్సైకు లక్షన్నర డబ్బులు ఇచ్చిందని ఆరోపించారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య దాడిలో ఓ వర్గం వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతను అందుబాటులో లేకపోవడంతో తల్లీ, సోదరిని స్టేషన్ కు తెచ్చి రాత్రి 10 గంటల వరకూ ఉంచారు. దీనిపై కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాధితుడి తండ్రి పోలీసులు తన కుమారుడితో గంజాయి అమ్మించి కేసు పెట్టారని ఆరోపించగా.. రెండో వర్గం వారిని రప్పిస్తే కానీ స్టేషన్ నుంచి వెళ్లనంటూ కొలికపూడి శ్రీనివాస్ రాత్రి పూట హంగామా చేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చివరకు ఎమ్మెల్యేకు ఎలాగోలా నచ్చజెప్పి పోలీసులు రాత్రి పంపించేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల తీరుపై స్టేషన్లోనే ఇంత బహిరంగంగా కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో ఆయనపై టీడీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది.












Click it and Unblock the Notifications