జగన్ నియంత పాలన; కల్తీసారా మరణాలు సహజ మరణాలుగా చిత్రీకరణ: మండిపడిన టీడీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న మరణాలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారాయి. జంగారెడ్డి గూడెం మరణాల విషయంలో చర్చకు పట్టుబట్టిన క్రమంలో నిన్న ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఇక ఈ రోజుకూడా మరో 11 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. జంగారెడ్డిగూడెం లో చోటుచేసుకున్న మరణాలపై చర్చ జరపాలని టిడిపి ఎమ్మెల్యేలు శాసన సభలో ఆందోళనకు దిగిన క్రమంలో టిడిపి ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీ సర్కార్ పాలన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సభలో ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలు ఎలా చేస్తారు: అనగాని సత్యప్రసాద్
టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కల్తీ సారా మరణాలపై చర్చకు పట్టుబడితే నిన్న ఐదుగురిని, ఇవాళ 11 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ లో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత ప్రకటన అని మండలిలో బొత్స ప్రకటించారని అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. సభలో ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలు ఎలా చేస్తారు అంటూ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.

కల్తీసారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ
నియంత పరిపాలన ఏ విధంగా ఉంటుందో శాసనసభ తలపిస్తుందని ఆయన మండిపడ్డారు. మూడేళ్ల క్రితం వివేకానంద రెడ్డి హత్యను సహజ మరణంగా చిత్రీకరించిన వైసీపీ నేతలు ఇప్పుడు కల్తీసారా మరణాలను అలాగే చిత్రీకరిస్తున్నారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ప్రజల బాధలు వివరించినా విచారణకు డిమాండ్ చేస్తుంటే టిడిపి నేతల గొంతునొప్పి తున్నారని అనగాని సత్య ప్రసాద్ మండిపడ్డారు.

26 కల్తీసారా మరణాల కంటే రాష్ట్రంలో ప్రాధాన్యమున్న అంశం ఏంటి: ఎమ్మెల్యే బెందాళం అశోక్
టిడిపి ఎమ్మెల్యే బెందాళం అశోక్ జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. 26 కల్తీసారా మరణాల కంటే రాష్ట్రంలో ప్రాధాన్యమున్న అంశం ఏముందో చెప్పాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. మార్షల్ సహాయంతో సభను ఎన్నిరోజులు నడుపుతారు అంటూ బెందాళం అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రి నో, ముఖ్యమంత్రి అర్థం కావడం లేదని జగన్మోహన్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు.

వైసీపీ రాచరిక పాలన: ఆదిరెడ్డి భవానీ, ఏలూరి సాంబశివరావు
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని రాష్ట్రమంతా జరుగుతున్న నాటుసారా స్కామ్ లో అందరూ నిరుపేదలు బలవుతున్నారు అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు తమ అవినీతి బయటపడుతుందని, సభలో కల్తీసారా అంశం చర్చకు రాకుండా చూస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నాయకులను సస్పెండ్ చేసి అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించటం దుర్మార్గమని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలన రాచరిక పాలనను తలపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల వాదన బయటకు రాకుండా చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. పోడియం వద్ద మార్షల్స్ తో తమపై దాడి చేయించారని ఏలూరు సాంబశివరావు ఆరోపించారు.












Click it and Unblock the Notifications