Bachula Arjunudu : టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత- గుండెపోటు తర్వాత నెలరోజులుగా కోమాలోనే !
గన్నవరం టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉంటూ స్ధానిక ఎమ్మెల్యే వంశీపై అలుపెరగని పోరాటం చేస్తున్న సమయంలో బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురయ్యారు.
టీడీపీ సీనియర్ నేత, కృష్ణాజిల్లా గన్నవరం పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్న బచ్చుల అర్జునుడు ఇవాళ తుదిశ్వాస విడిచారు. విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ చనిపోయారు. ఆయన్ను బతికించేందుకు గత కొన్ని రోజులుగా వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.
నెల రోజుల కిందట గుండెపోటుకు గురై విజయవాడ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అర్జునుడు.. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ఆయన్ను బతికించేందుకు గుండెకు డాక్టర్లు శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. అయినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. నెల రోజులుగా కోమాలోనే ఉన్న అర్జునుడు ఇవాళ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతిపై టీడీపీ నేతలు వరుసగా సంతాపం ప్రకటిస్తున్నారు.

బచ్చుల అర్జునుడు మృతిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. నిజాయితీ నిబద్దత కల్గిన నేత బచ్చుల అర్జునుడు అని, ఆయన మరణ వార్త తీవ్ర దిగ్రాంతికి గురి చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లాలో పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. అర్జునుడు పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేవారని, పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా అర్జునుడు ముందే ఉండేవారన్నారు. ఎమ్మెల్సీగా మండలిలో వైసీపీ మంత్రుల అబద్దాల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టారన్నారు. అర్జునుడి మృతితో టీడీపీ ఒక సమర్ధవంతమైన నేతని కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్దిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications