జగన్ ఐటీ సమీక్షపై లోకేష్ సెటైర్లు-సలహాదారులన్ని కంపెనీలూ రాలే-కనీసం వారి సంస్ధలూ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీలపై ఐటీ శాఖ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ఇవాళ సెటైర్లు వేశారు. సీఎం జగన్ ఇవాళ ఏర్పాటు చేసిన ఐటీ శాఖ సమీక్షను లక్ష్యంగా చేసుకుంటూ లోకేష్.. వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఇందులో జగన్ సలహాదారుల్ని కూడా లాగారు.
ఐటీశాఖపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశం ఫొటోల్ని ట్యాగ్ చేస్తూ లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐటీ శాఖపై జగన్ గారు నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫొటోలు ఆ శాఖ దుస్ధితిని తెలియజేస్తున్నాయంటూ లోకేష్ ట్వీట్ చేశారు. విగ్రహ పుష్టి, నైవైద్య నష్టి అన్నట్లు తయారైంది ఏపీ ఐటీ శాఖ పరిస్ధితి అంటూ లోకేష్ తన ట్వీట్లో ఆక్షేపించారు. డజన్ల కొద్దీ సలహాదారుల్ని పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రానికి వచ్చి కంపెనీలు శూన్యమంటూ జగన్ సర్కార్ వైఫల్యాన్ని లోకేష్ ప్రశ్నించారు.

కనీసం రివ్యూ మీటింగ్ లో హాజరైన సలహాదారులన్ని కంపెనీలు కూడా ఈ రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి రాలేదంటూ లోకేష్ విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు మా శ్రమ ఫలితమే అని బిల్డప్ ఇచ్చే పనిలో ఐటీశాఖ మంత్రి బిజీగా ఉన్నారంటూ లోకేష్ పేర్కొన్నారు. కంపెనీలు తీసుకురావడం చేతకాని సలహాదారుల గుంపు అంటూ సెటైర్లు వేశారు.

టీ, కాఫీలు తాగుతూ కాలం గడిపేస్తున్నారని, కొత్తవి రాకపోగా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు బైబై జగన్ అంటున్నాయని లోకేష్ విమర్శించారు. సలహాదారుల్లో కొందరికి ఇతర రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉన్నా జగన్ రెడ్డి ముఖం చూసి రాష్ట్రంలో కంపెనీ పెట్టేందుకు ముందుకు రాకపోవడం కొసమెరుపంటూ లోకేష్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications