మేం విరాటపర్వంలో పాండవులం: బడ్జెట్‌పై టిడిపి ఎంపి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం బడ్జెట్ ఆశాజనంకగా ఉందని ఆయన అన్నారు.
దేశానికంతా ఈ బడ్జెట్ బాగుందేమో కానీ తన వరకు మాత్రం నిరాశజనకంగా ఉందని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి విరాట పర్వంలోని పాండవుల మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. మరోవైపు విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తామని కేంద్ర చెప్పినప్పటికీ దానిపై స్పష్టత ఇవ్వలేదని గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.
ఏపీ విషయంలో కేంద్రం శ్రద్ధ చూకపోవడం నిరాశ కలిగించిందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై ఈ బడ్జెట్‌లో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మొదటి నుంచి కేంద్రంపై ఒత్తిడి చేస్తునే ఉన్నామని ఎంపీ రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ ఒక్కరినీ నిరాశపర్చిందని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం పొరపాట్లను అరుణ్‌జైట్లీ సవరిస్తారని ఆశించినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరమని మంత్రి అన్నారు.
ఐదేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో కేవలం వందకోట్లే కేటాయించరని ఇలా అయితే వందేళ్లయినా పోలవరం పూర్తికాదని మంత్రి వ్యాఖ్యానించారు. మరోసారి ప్రధాని, ఆర్థిక మంత్రి కలిసి జరిగిన పొరపాట్లను సవరించాలని కోరతామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
సోమిరెడ్డి మాత్రం ఆశాజనకమని వ్యాఖ్య
కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజనకంగానే ఉందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. విభజన ద్వారా ఏపీకి జరిగిన నష్టాన్ని పూరించేందుకు కేంద్రం ప్రయత్నించిందని ఆయన శనివారం మీడియాతో చెప్పారు. ఏపికి ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామన్నందుకు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పలు విద్యాసంస్థలకు నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. సర్వీసు ట్యాక్స్ పెంపు వల్ల ప్రజలపై భారం పడుతుందని సోమిరెడ్డి తెలిపారు.
సంపదపన్ను రద్దు చేయడం శుభపరిణామని, నల్లధనంపై బిల్లును తెస్తామనడం ఆహ్వానించ దగ్గ విషయమని ఆయన అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తిని ఆశించామన్న సోమిరెడ్డి ప్రత్యేక హోదా సాధించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications