టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఫైనల్?
గతంలో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు.. 2024లో ఏపీలో జరగబోయే ఎన్నికలు ఒక ఎత్తు. అనేక కారణాల రీత్యా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన పార్టీలు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేయడం ఒక కసరత్తుకాగా, లోక్‌సభ స్థానాలకు ఎంపిక చేయడం అంతకు మించిన కసరత్తు అవుతుంది. ప్రస్తుతానికి అధికారంలోని వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లను సాధించడంపైనే దృష్టిసారించాయి.

వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమ నేతలో ఈ మార్పు చూడని పార్టీ శ్రేణులు కూడా తొలిసారి దూకుడైన రాజకీయం చేస్తున్న బాబును చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు ఈసారి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించుకుంటూ వస్తున్నారు. సీట్లు ఖరారు చేయకుండా చివరివరకు నాన్చుతారు అనే ముద్రను ఆయన తొలగించుకోవాలనేరీతిలో ఆయన వైఖరి ఉంది. కడప, రాజంపేట స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించారు. ఇప్పుడు నరసరావుపేటపై ఆయన దృష్టి పడింది.

కొంచెం కష్టపడితే చాలు.. సులువుగా గెలవొచ్చు
కొంచెం కష్టపడితే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట లోక్‌సభ స్థానాన్ని సులువుగా గెలుచుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి రాయపాటి సాంబశివరావు విజయం సాధించారు. 2019లో ఓటమిపాలయ్యారు. వయోభారంతో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవడంతో పార్టీ కొత్త అభ్యర్థిని ఎంపిక చేయబోతోంది. పలువురు పారిశ్రామికవేత్తలు పోటీలో ఉన్నప్పటికీ ఎవరిని ఖరారు చేయనున్నారనేది తెలియరాలేదు. మైదుకూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ యాదవ్‌ను నరసరావుపేట లోక్‌సభ స్థానానికి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.

పుట్టా మహేష్ యాదవ్ కు ఇస్తారా?
తన కుమారుడిని అక్కడ పోటీకి దింపితే అవసరమైతే మైదుకూరు నుంచి తాను తప్పుకుంటానని సుధాకర్ చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోని మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు మహేష్ అల్లుడవుతారు. టీడీపీ నిర్వహించుకున్న అంతర్గత సర్వేలో నరసరావుపేట లోక్‌సభ పరిధిలోని వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల పరిధిలో యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆ కోణంలో అభ్యర్థిని ఎంపికచేస్తే విజయం సులువని తేలింది. పుట్టా మహేష్ రెండురోజుల క్రితమే పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుణ్ని కూడా కలిశారు. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మహేష్ కోసం ప్రయత్నం చేస్తుండటంతో ఆయనకు దాదాపుగా సీటు ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications