విశాఖపట్నంలో చేతులు మారిన భూమి 70 వేల ఎకరాలు?
విశాఖపట్నంలో లో గత మూడున్నరేళ్లలో 70వేల ఎకరాల భూమి చేతులు మారిందని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం ఆరోపించింది. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉండవల్లిలో సమావేశం జరిగింది. అసెంబ్లీలో అమరావతి అంశంపై ప్రభుత్వం వైఖరి, సీఎం జగన్ ప్రసంగం తదితర అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.
ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే పరిపాలన వికేంద్రీకరణ అని మండిపడ్డారు. కుట్రతో రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేసి వికేంద్రీకరణ అంటే తెలుగు జాతి క్షమించదన్నారు. ఉత్తరాంధ్రపై అభిమానం ఉంటే మూడున్నర సంవత్సరాలుగా విశాఖపట్నంను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ తెచ్చిన కోట్ల రూపాయల విలువ చేసే సంస్థలను వెళ్లగొట్టారని, విశాఖను దోచుకోవడమే లక్ష్యంగా మందిని దింపారని, కులాల మధ్య కుంపటి పెడుతూ అడ్డంగా దోచుకుంటున్నారని సాంబశివరావు దుయ్యబట్టారు.

అమరావతి రైతులపై ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేలా సీఎం జగన్ ప్రసంగించడం అత్యంత దుర్మార్గమని, ఏదో ఒకరకంగా రాజధానిని చిదిమేయాలనే కుట్రకు తెరలేపారని ఆరోపించారు. చేతకానితనం, అసమర్థత కప్పిపుచ్చుకునేందుకు రాజధానిపై జగన్ ద్వేషం కక్కారని, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చంద్రబాబు బీజం వేస్తే జగన్ దాన్ని చంపేశారన్నారు. ఖర్చు లేకుండా అమరావతి అభివృద్ధికి టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇప్పుడు రూ.లక్షల కోట్లు అవసరమవుతోందంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దేవుళ్లని కూడా సీఎం జగన్ తన రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications