వ్యూహాలపై సుదీర్ఘ చర్చ: ముగిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షత జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సమావేశంలో చర్చించారు.

ముఖ్యంగా శనివారం ఢిల్లీలో జరగనున్న ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

హైకోర్టు విభజనపై సామరస్య పరిష్కారానికి కూడా సంసిద్ధత తెలియజేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కౌన్సిల్‌లో ప్రస్తావించాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ ప్రనర్వ్యవస్థీకరణ బిల్లుపై కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రంలో ప్రభుత్వానికి, పార్టీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టెక్కడం ఎలా? అనే దానిపై చర్చించారు.

దీంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలా రప్పించుకోవాలి? అన్న విషయపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలపై చర్చించేందుకు బీజేపీ ఎంపీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.

కేఎల్ రావు జయంతిలో పాల్గొన్న చంద్రబాబు

సొంత రాష్ట్రానికి ఎక్కువ సహాయం చేస్తున్నారని ఆరోపణలు వస్తే నీతి తప్ప పదవి ముఖ్యం కాదని ఎంపీ పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి కేఎల్ రావు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఇంజనీర్‌ కేఎల్‌ రావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప గొప్ప ఇంజనీర్లకు కేఎల్‌ రావు స్ఫూర్తి అని అన్నారు. కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతున్నామని, ఏడాదిలో పట్టిసీమను పూర్తిచేసి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని ఆయన చెప్పారు.

ఏడాది కాలంలోనే పట్టిసీమను పూర్తి చేసి చరిత్ర సృష్టించామని చంద్రబాబు పేర్కొన్నారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్‌ చదువును విదార్థులు వినూత్న ఆలోచనలతో రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరిగేషన్ రంగంలో కేఎల్‌ రావు చేసిన సేవలను ఆయన కొనియాడారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp Parliamentary Meeting Ended In Vijayawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X