తిరుపతిలో జరిగేది టీడీపీ రాజకీయ సభ... అల్లర్లకు ప్లాన్; మంత్రి బొత్సా కొత్త అనుమానం
మూడు రాజధానులపై జగన్ సర్కారు కట్టుబడి ఉందని, మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి తమ విధానమని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఆయన వెల్లడించారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో శుక్రవారం తిరుపతిలో జరుగనున్న అమరావతి రైతులు బహిరంగసభపై బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతిలో జరిగేది రైతుల సభ కాదు .. టీడీపీ రాజకీయ సభ
శుక్రవారం తిరుపతిలో జరుగుతుంది అమరావతి రైతుల సభ కాదని, తెలుగుదేశం పార్టీ రాజకీయ సభ అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పేరుతో పాదయాత్రగా వెళ్లిన రైతులంతా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులను అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయడం కోసం పాదయాత్ర ప్రారంభించారని పేర్కొన్న బొత్స సత్యనారాయణ, కేవలం అమరావతి మాత్రమే కాదు అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నది వైసిపి ప్రభుత్వ ఆకాంక్ష అని వెల్లడించారు.

తామెప్పుడూ అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పలేదు
మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న తమ ప్రభుత్వ ఆలోచనకు ముమ్మాటికీ కట్టుబడి ఉంటామని బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై చర్చించి తప్పులు సరిదిద్ది బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడతామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎన్నికల ముందు తామెప్పుడూ అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని చెప్పలేదని పేర్కొన్న బొత్స సత్యనారాయణ తన మేనిఫెస్టో లోనూ ఆ విషయం లేదని ఉంటే చూపించాలని ప్రశ్నించారు.

రైతుల పాదయాత్రకు ప్రజల మద్దతు లేదు, ఉంది టీడీపీ మద్దతు మాత్రమే
రైతుల పాదయాత్ర కు టిడిపి మద్దతు మాత్రమే ఉందని, ప్రజల మద్దతు ఏమాత్రం లేదని బొత్ససత్యనారాయణ తేల్చి చెప్పారు. రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడమే అజెండాగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ రాజధాని అమరావతి ఉద్యమాన్ని చేస్తోందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి అమరావతి ఓ ఏటీఎం కార్డు అని సాక్షాత్తూ ప్రధానమంత్రి చెప్పారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. శాసన రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని పేర్కొన్న ఆయన మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతిలో రైతుల పేరుతో టిడిపి రాజకీయ సభ జరుగుతుందని బొత్ససత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

తిరుపతి సభలో అల్లర్లు చేసి మాపై నెట్టేసే కుట్ర చేస్తున్నట్టు అనుమానం
తిరుపతి సభలో టీడీపీ అల్లర్లు చేసి మాపైన నెట్టేసే కుట్రలు చేస్తున్నట్టు అనుమానాలున్నాయని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతి ఒక అవినీతి రూపమని బీజేపీనే చెప్పిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రతిపక్షాల త్యాగాలు త్యాగాలు అని పదేపదే చెబుతున్నారని ఎవరి కోసం త్యాగాలు చేస్తున్నారో చెప్పాలని ప్రతిపక్షాలను బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్, పోలవరం ప్రాజెక్టు కడుతుంటే ఎంతో మంది రైతుల భూములు ఇచ్చారు కదా అంటూ బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. ఆ రైతులు చేసింది త్యాగాలు కాదా అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసే పనులు కూడా త్యాగమా .. చంద్రబాబు చెప్పాలి
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న పనులను త్యాగం అంటారా ... చెప్పాలని బొత్ససత్యనారాయణ నిలదీశారు. కేవలం ఒక సామాజిక వర్గం కోసం చేసే పనులు త్యాగాలు అవుతాయా అంటూ ప్రశ్నించిన బొత్ససత్యనారాయణ దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను రాజధానిగా చేయడాన్ని వద్దంటున్నారు అని అచ్చెన్నాయుడు చెబుతున్నారని, అచ్చెన్నాయుడు కు ఈ విషయాన్ని ఎవరు చెప్పారో చెప్పాలంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తాము ఏ ఒక్క ప్రాంతానికీ వ్యతిరేకం కాదని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం తమ లక్ష్యమన్నారు బొత్ససత్యనారాయణ.












Click it and Unblock the Notifications