తెనాలిలో జగన్ కు నిరసన సెగ-రచ్చ రచ్చ..!
కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాలు రోజురోజుకూ ఉద్రిక్తతల్ని పెంచుతున్నాయి. తెనాలిలో నడిరోడ్డుపై ముగ్గురి రౌడీ షీటర్లను పోలీసులు బహిరంగంగా చావబాదిన ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ అక్కడికి వెళ్లి వారి కుటుంబాల్ని పరామర్శించేందుకు సిద్దమయ్యారు. ఈ ఉదయం తెనాలికి జగన్ వస్తున్నారన్న సమాచారంతో టీడీపీతో పాటు కూటమి పార్టీల శ్రేణులు నిరసనలకు రంగం సిద్ధం చేసుకున్నాయి.
తెనాలిలో జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాలతో పాటు కూటమి పార్టీల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.
తెనాలిలోని ఐతానగర్ సెంటర్లలో జగన్‍ను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు...నినాదాలు చేశారు. తెనాలి మార్కెట్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. రౌడీషీటర్లకు జగన్ మద్దతుగా నిలిచారంటూ దళితసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి కూటమి పార్టీలు మద్దతుగా నిలిచాయి.

జగన్ పర్యటనకు నిరసనగా తెనాలిలో దళిత, ప్రజాసంఘాలతో పాటు కూటమి పార్టీల కార్యకర్తలు నల్ల బెల్లూన్లతో ఆందోళన చేపట్టారు. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. అయితే జగన్ టూర్ పోలీసుల భద్రత మధ్య కొనసాగుతోంది. తెనాలిలో బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్ ను వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆహ్వానించారు. వీరితో కలిసి జగన్ బాధితుల పరామర్శకు వెళ్లారు. వీరిని పరామర్శించడం కరెక్ట్ కాదని కూటమి నేతలు చెప్తున్నారు.
ఇప్పటికే రౌడీ షీటర్లు, గంజాయ్ బ్యాచ్ ను పోలీసులు కొట్టడాన్ని ప్రభుత్వం, హోంమంత్రి సమర్ధించుకున్నారు. పోలీసులు పనిచేయాలంటారని, పనిచేస్తే తప్పు పడతారా అంటూ హోంమంత్రి నిన్న ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తెనాలి టూర్ లో జగన్ ను అడ్డుకునేందుకు నిరసనకారులు ప్రయత్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం అండతోనే వీరు జగన్ టూర్ కు ఆటంకాలు కల్పిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications