ఇక టిడిపి డిజిటల్ ఆర్మీ: పార్టీకి హైటెక్ హంగులు, స్పెషల్ వర్క్‌షాప్
అమరావతి: పాలనలో అయినా...పార్టీలోనైనా అయినా సాంకేతికతను మేళవించడంలో టిడిపి ఎప్పుడూ ముందుంటుంది...మారుతున్న కాలానికి అనుగుణంగా అప్ డేట్ అవ్వడంలో టిడిపిదో స్పెషల్ స్టైల్. ఆధునికతకు టెక్నాలజీ జోడించి అవసరమై లక్ష్యాలను చేధించేందుకు ఆ పార్టీ ప్రత్యేక కృషి చేస్తూ ఉంటుంది.
ఈ మధ్యకాలంలో అందరూ టెక్నాలజీ పై దృష్టి సారించడంతో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల కంటే మరింత ముందు ఉందేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తోంది. పైగా అధికార పార్టీ అయిన టిడిపి ఇటీవల కాలంలో ప్రభుత్వపాలనకు డిజిటల్ టెక్నాలజీని జోడించడానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మార్పుకు అనుగుణంగా తమ పార్టీ ని సన్నద్దం చేయడంపై టిడిపి ప్రత్యేక దృష్టి పెట్టింది.

స్పెషల్ ఫోకస్...
కాలానుగుణంగా టెక్నాలజీలో వస్తున్న మార్పులను తమకు అనుగుణంగా మలుచుకునేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోంది. కేవలం హార్డ్ వర్క్ కే పరిమితం కాకుండా స్మార్ట్ వర్క్ ద్వారా మరింత ప్రయోజనాలు పొందేలా ప్రణాళిక సిద్దం చేసింది. ఆ క్రమంలో ప్రభుత్వ పాలనలో తాము అవలంబిస్తున్నడిజిటల్ టెక్నాలజీని పార్టీ కేడర్ అర్థం చేసుకునేలా వారి కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనుంది.
Recommended Video


కేడర్ కు అవగాహన....
సెంటర్ ఫర్ లీడర్ షిప్ ఎక్స్ లెన్స్ పేరుతో టిడిపి ఈ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. పార్టీ కార్యకలాపాల్లో ఎలాంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు, ఆ సాంకేతిక విషయాలను అర్ధం చేసుకోవడం ఎలా, న్యూ టెక్నాలజీని ఉపయోగించి పార్టీకి మరింత ప్రయోజనం ఏవిధంగా చేకూర్చవచ్చు అనే అంశాలపై ఈ వర్క్ షాప్ లో శిక్షణ ఇవ్వనున్నారు.

వర్క్ షాప్ ఫోకస్...
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పాలనలో డిజిటల్ టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉండేలా ఒక స్పెషల్ డిజిటల్ ఆర్మీని ఇక్కడ తయారు చేయనున్నారు. ఇంకా చెప్పాలంటే వీరిని తెలుగు దేశం పార్టీ డిజిటల్ సైన్యంగా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో పార్టీ వాణీని బలంగా వినిపించే కార్యకర్తలకు, వాలంటీర్లకు నాయకత్వ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

వర్క్ షాప్ ఎక్కడ...
మంగళగిరి సమీపంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో శనివారం నుంచి ఈ డిజిటల్ ఆర్మీకి ట్రయినింగ్ ఇచ్చే వర్క్ షాప్ ప్రారంభం అవుతుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో న్యూ టెక్నాలజీని వినియోగించి పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు ఎలా తీసుకువెళ్ళొచ్చనే విషయాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు.

డిజిటల్ ఆర్మీ
ఈ వర్క్ షాప్ కు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలకు చెందిన టిడిపి కేడర్ తో పాటు తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు పాల్గొంటున్నారు. ముందు ముందు టిడిపిని తెలుగు రాష్ట్రాలతో పాటు ఆ రెండు రాష్ట్రాల్లో కూడా మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాలుగు రాష్ట్రాలకు సంబంధించి సుమారు 1000 మందికి ఈ డిజిటల్ ఆర్మీ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. వీరిని బ్యాచ్ ల వారీగా విభజించి శిక్షణ ఇస్తారు.

డిజిటల్ ఆర్మీ ఏం చేస్తుంది...
సోషల్ మీడియా వేదికగా ప్రజా సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం దృష్టి సారించడం ఈ డిజిటల్ ఆర్మీ లక్ష్యాల్లో ఒకటి. అలాగే ప్రజల అభిప్రాయాలు, వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవడం, వాటిని ప్రభుత్వం, పార్టీ దృష్టికి తీసుకెళ్లడం మరో బాధ్యత. అలాగే ప్రత్యర్థి పార్టీల పోకడలు, వారి పోకడలను పసిగట్టగలగడం కూడా ఒక బాధ్యతే.

లోకేష్ దిశానిర్ధేశం...
పార్టీకి సంబంధించి భవిష్యత్ లో ఈ డిజిటల్ ఆర్మీ సేవలు ఎంతో కీలకమని భావిస్తున్న టిడిపి ఈ వర్క్ షాప్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్లే టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొని డిజిటల్ ఆర్మీకి దిశా నిర్దేశం చెస్తారని తెలిసింది.

పార్టీ లక్ష్యం...
టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఒడిసిపట్టుకొని పార్టీని బలోపేతం చెయ్యాలనేది టిడిపి ఈ డిజిటల్ ఆర్మీని సన్నధ్దం చెయ్యడం వెనుక ప్రధాన లక్ష్యం. అంతేకాదు వచ్చే ఎన్నికల నాటికి దాదాపు లక్ష మంది డిజిటల్ సైన్యాన్ని సిద్ధం చేయాలన్నదే ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications