ఏపీ స్కూళ్ల రీఓపెనింగ్ వాయిదా ? ప్రభుత్వానికి వినతులు..
ఏపీలో వడగాల్పుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఇంకా రాష్ట్రాన్ని పలకరించకపోవడంతో జనం వేడి, ఉక్కపోతకు అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లను షెడ్యూల్ ప్రకారమే జూన్ 12న అంటే మరో మూడు రోజుల్లో పునఃప్రారంభం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికారుల్ని సిద్ధం చేస్తోంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత ఇంకా తగ్గకపోయినా పాఠశాలల్ని పునఃప్రారంభం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తల్లితండ్రులు, టీచర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వడగాల్పుల తీవ్రత తగ్గాక స్కూళ్లను పునఃప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది. ఎలాగో వచ్చేవారు రుతుపవనాలు ఏపీని తాకే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరోవైపు జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా పాఠశాలల పునఃప్రారంభం వాయిదా వేయాలని ఆయన కోరారు. జూన్ రెండవ వారం ముగుస్తున్నా ఇప్పటికీ అధిక ఉష్టోగ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాలలకు విద్యార్థులు హాజరైతే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సత్యప్రసాద్ సీఎం జగన్ కు రాసిన లేఖలో తెలిపారు.
ఎండ వేడికి తట్టుకోలేక మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీ రూముల్లో నుంచి బయటకు రావట్లేదని, అలాంటిది చిన్న పిల్లలు పాఠశాలలకు ఎలా వస్తారని ఎమ్మెల్యే సత్యప్రసాద్ సీఎం జగన్ ను ప్రశ్నించారు. ప్రభుత్వానికి స్కూళ్ల ప్రారంభంపై ఉన్న శ్రద్ధ నాడు-నేడు పనులు పూర్తి చేయడంలో ఎందుకు లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. అధిక ఉష్టోగ్రతల నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పునఃప్రారంభం పది రోజులు వాయిదా వేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications