అమరావతి చుట్టూనే టీడీపీ రాజకీయం- అక్కడా ఊపిరి సలపనివ్వని జగన్..?
ఏపీలో స్ధానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓ రేంజ్ లో ఎదుర్కోవాలని భావిస్తున్న టీడీపీ ఇన్నాళ్లూ తాము ఉద్యమం చేసిన అమరావతి అంశాన్ని ఓటర్లలో తీసుకువెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న పలు నిర్ణయాలను ఎండగడుతూనే అమరావతి అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. అయితే టీడీపీ వాదనను అమరావతి ప్రాంతంలోనే తిప్పికొట్టేందుకు బహుజన పరిరక్షణ సమితి పేరుతో పోటీ ఉద్యమానికి జగన్ ఊపిరిలూదుతున్నారు. దీంతో సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో సైతం టీడీపీ తన వాదన వినిపించలేక చతికిలపడుతోంది.

అమరావతి రాజధాని అజెండా
ఏపీలో వికేంద్రీకరణ పేరుతో అమరావతిలో ఉన్న రాజధానిని విశాఖకు తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్ధానిక ఎన్నికల పోరులో అజెండాగా మార్చేందుకు విపక్ష టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న పలు నిర్ణయాలను, వాటి వల్ల ఎదురైన పరిణామాలను ఓటర్లకు వివరిస్తోంది. అయితే అంతకంటే ఎక్కువగా అమరావతి రాజధానిని మార్చడం వల్ల వైసీపీ ప్రభుత్వం చారిత్రక తప్పిదానికి పాల్పడుతోందని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇది అమరావతి రైతులను మోసం చేయడమే అని టీడీపీ విమర్శిస్తోంది.

మూడు రాజధానులకు స్పందన
అమరావతి రాజధాని మార్పుపై టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రచారానికి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కార్యనిర్వాహక రాజధాని ప్రకటించిన విశాఖతో పాటు న్యాయ రాజధానిగా ఎంపికైన కర్నూలులో అమరావతి వాదన ముందునుంచే తేలిపోయింది. అయితే ఎన్నికల వేళ తటస్ధ ఓటర్లను ఆకట్టుకునేందుకు టీడీపీ మరోసారి రాజధాని మార్పు వ్యవహారాన్ని ఓటర్లలోకి తీసుకెళుతోంది. అయితే దీనిపై టీడీపీ కోరుకున్నంత చర్చ క్షేత్రస్ధాయిలో జరగకపోవడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారుతోంది.

అమరావతి పరిధిలో సైతం..
ఏపీ రాజధాని అమరావతిని విడగొట్టి మూడు రాజధానులుగా చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం సాగిస్తోంది. ఏపీలో ఒక్క రాజధాని అమరావతి మాత్రమే కొనసాగాలంటే టీడీపీకే మద్దతు ఇవ్వాలని కోరుతోంది. అయితే విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సహజంగానే ఈ వాదనకు పేలవ స్పందన వస్తోంది. విశాఖ జిల్లాలో అయితే పార్టీ జిల్లా అధ్యక్షులు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయే పరిస్ధితి. అయితే అమరావతిలోనైనా ఈ వాదన నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్న టీడీపీకి రాజధానిలో బహుజన పరిరక్షణ పేరుతో మొదలైన పోటీ ఉద్యమం ముచ్చెమటలు పట్టిస్తోంది. రాజధాని గ్రామాల్లో ఎన్నికలు జరగకపోయినా పొరుగున ఉన్న విజయవాడ, గుంటూరు కార్పోరేషన్లు, స్ధానిక పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్ధానాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది.
Recommended Video


అమరావతిలోనూ నెగ్గని వాదన..
మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన ఉద్యమం ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపించకపోగా.. సీఆర్డీయే పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లోనూ విస్తరించకపోవడం ఆ పార్టీకి పెద్ద షాక్ గానే చెప్పవచ్చు. దీంతో సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోనూ స్ధానిక పోరులో వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడ కార్పోరేషన్ పరిధిలో మాత్రమే దీనిని కొంతలో కొంత మినహాయింపు ఉండొచన్న అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications