జేసీ ప్రభాకర్ రెడ్డితో కన్నీళ్లు పెట్టించిన లోకేష్ పాదయాత్ర..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ యువనేత నారాలోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర ఇప్పటికే రాయలసీమలో పలు జిల్లాల్ని దాటుకుని అనంతపురం జిల్లా తాడిపత్రికి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో లోకేష్ పరిస్ధితిని తల్చుకుంటూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.
లోకేష్ పాదయాత్రపై ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని జేసీ తెలిపారు. లోకేష్ అరికాలి బొబ్బల్ని తల్చుకుని జేసీ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. లోకేష్ కర్మజీవి అని, ఆయన పగిలిన కాళ్లను చూస్తుంటే తనకే ఇలా ఉంటే ఆయన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ తల్లితండ్రులు, సతీమణికి చేతులెత్తి మొక్కుతున్నానన్నారు.

తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి రెండు రోజులు పాదయాత్రలో నడిస్తేనే కాళ్ల నొప్పులు వచ్చాయని, అలాంటిది ప్రజల కోసం లోకేష్ వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని జేసీ వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ ను చూసినట్లుగా జనం లోకేష్ ను చూస్తున్నారన్నారు. ఏపీ బాగుపడాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని జేసీ తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా లోకేష్ పాదయాత్ర పూర్తి చేయాలన్నారు.












Click it and Unblock the Notifications