JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి రాజీనామా ప్రకటన..!
ఏపీ ఎన్నికల్లో కూటమి సృష్టించిన సునామీ ప్రభావం రాష్ట్రంలో రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంతో హోరాహోరీ పోరాడిన టీడీపీ నేతలు రాష్ట్రంలో ప్రభుత్వం మార్పుతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అదే సమయంలో భవిష్యత్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇదే క్రమంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు.
ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన భవిష్యత్ వ్యూహాల్ని వెల్లడించారు. మున్సిపల్ ఛైర్మన్ పదవికి నెల రోజుల్లో రాజీనామా చేసి టీడీపీలో ఇతర నేతలకు అప్పగిస్తానని జేసీ వెల్లడించారు. అయితే ఆయన ఏ బాధ్యతల్లోకి వెళ్తారనేది ఇంకా తేలలేదు. తాడిపత్రిలో ఐదేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో సై అంటే సై అంటూ రాజకీయాలు నడిపిన జేసీ ప్రభాకర్ రెడ్డికి టీడీపీలో కీలక పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు తాడిపత్రి నుంచి ఈసారి ఎమ్మెల్యేగా తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని గెలిపించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. గతంలోలా జిల్లా రాజకీయాలపై తన ముద్ర వేసేందుకు జేసీ ప్రయత్నిస్తారని చెప్తున్నారు. అందుకే మున్సిపల్ ఛైర్మన్ పదవి వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జేసీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications