టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకి గుండెపోటు... ఆస్పత్రిలో చేరిక...
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం(ఆగస్టు 16) రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అయన రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జ్యోతుల ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. జ్యోతుల నెహ్రూ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసి మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే చంటిబాబు, స్థానిక నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ జగ్గంపేట టీడీపీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేత జ్యోతుల చంటిబాబుపై జ్యోతుల నెహ్రూ ఓటమిపాలయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన... ఆ తర్వాత టీడీపీలో చేరారు. గతంలో 1994,1999లలో టీడీపీ తరుపున జగ్గయ్యపేట నుంచి వరుసగా రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలాకాలం టీడీపీలో పనిచేసిన ఆయన వైసీపీలో ఎక్కువ కాలం ఉండలేక తిరిగి సొంత గూటికి వెళ్లిపోయారు.
జ్యోతుల వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో... అప్పటివరకూ టీడీపీలో ఉన్న జ్యోతుల చంటిబాబు వైసీపీలో చేరారు. జ్యోతుల రాకతో చంద్రబాబు తనకు ప్రాధాన్యం తగ్గించారనే అసంతృప్తితో చంటిబాబు పార్టీ మారారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూపై చంటిబాబు విజయం సాధించారు.












Click it and Unblock the Notifications