AP Tdp Chief : ఏపీ టీడీపీకి కొత్త బాస్ ? అచ్చెన్నాయుడు స్ధానంలో త్వరలో బాధ్యతలు..!
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కూటమికి 175 సీట్లకు గానూ 164 సీట్లు లభించగా.. వైసీపీ మాత్రం 11 సీట్లకు పరిమితమైంది. ఇందులో టీడీపీ అత్యధికంగా 136 సీట్లు సాధించింది. కూటమికి నేతృత్వం వహించిన టీడీపీ.. కొత్త ప్రభుత్వ ఏర్పాటులోనూ సింహభాగాన్ని అందుకుంది. అదే సమయంలో చాలా మంది సీనియర్లకు కేబినెట్ లో అవకాశం కల్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ పదవుల్లో వారికి చోటు కల్పించే దిశగా అడుగులేస్తోంది.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు చంద్రబాబు కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. దీంతో ఆయన టీడీపీ వ్యవహారాలపై పూర్తిస్ధాయిలో ఫోకస్ పెట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్ధానంలో మరో సీనియర్ నేతకు ఏపీ పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గాజువాక నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావు పేరు పరిశీలిస్తున్నారు.

బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతే కాదు రాష్ట్రంలోనే అత్యధికంగా 95235 ఓట్ల మెజార్టీ కూడా సాధించారు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు, బీసీ అయిన అచ్చెన్నాయుడు స్ధానంలో పల్లాకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని కూడా చెబుతున్నారు. త్వరలో పల్లా శ్రీనివాసరావు పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పల్లా తర్వాత కేబినెట్లో చోటు దక్కని మరికొంతమంది సీనియర్లకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు.












Click it and Unblock the Notifications