రేపు అసెంబ్లీకి హాజరుపై టీడీపీ నిర్ణయం ఇదే- లోకేష్ కీలక ప్రకటన..
రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై సభలో చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు అంశాన్ని సభలో చర్చకు పెట్టబోతోంది. అలాగే తమ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
రేపు ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అంశంపై చర్చించేందుకు ఆ పార్టీ శాసనసభాపక్షం ఇవాళ సమావేశమైంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ శాసనసభా పక్ష సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ ద్వారా హాజరయ్యారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ భేటీలో రేపటి నుంచి అసెంబ్లీకి హాజరు కావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపైనా చర్చించిన శాసనసభాపక్షం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయించిన నేపథ్యంలో నారా లోకేష్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు. పోరాటమే అజెండాగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, ప్రజా సమస్యలపై ప్రస్తావించేందుకు చట్టసభల వేదిక వదులుకోకూడదని లోకేషే ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులకు తెలిపారు.
సభలో పోరాటం చేద్దాం, వీధుల్లోనూ పోరాటం చేద్దామని నారా లోకేష్ వారికి సూచించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతల్ని లోకేష్ కోరారు. సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా సాధిద్దామని వారికి తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఉద్యమించాలని నిర్ణయించినట్లు లోకేష్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications