నేడు టీడీపీ ఖాతాలోకి మరో మున్సిపల్ కార్పోరేషన్..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక విపక్షంలో ఉన్న వైసీపీ చేతుల్లో ఉన్న స్థానిక సంస్థలు ఒక్కొక్కటిగా చేజారుతున్నాయి. వీటిని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు అధికార కూటమి చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలమిస్తున్నాయి. దీంతో ఇవాళ మరో నగర పాలక సంస్థ వైసీపీ నుంచి టీడీపీ చేతుల్లోకి రాబోతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు మేయర్, కార్పోరేటర్లు సిద్దమయ్యారు.

2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏలూరు కార్పోరేషన్ లోని 50 సీట్లలో 47 సీట్లలో వైసీపీ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడేళ్ల పాటు అధికారం అనుభవించిన కార్పోరేటర్లు ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తామూ ప్లేటు ఫిరాయించేస్తున్నారు. మేయర్ నూర్జహాన్ తో పాటు పలువురు వైసీపీ కార్పోరేటర్లు ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇవాళ వారు చంద్రబాబు, లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అనంతరం ఏలూరు కార్పోరేషన్ పై టీడీపీ పట్టు బిగించబోతోంది.
ఇప్పటికే ఏలూరులో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఆళ్ల నాని ఈ మధ్యే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆయనతో పాటు బొద్దాని శ్రీనివాస్, మంచం మైబాబు వంటి నేతలు కూడా పార్టీని వీడారు. వీరిలో ఆళ్ల నాని మినహా మిగిలిన వారంతా మేయర్, కార్పోరేటర్లతో కలిసి ఇవాళ టీడీపీలో చేరబోతున్నారు. అదే జరిగితే ఏలూరు కార్పోరేషన్ లో టీడీపీ అనధికారికంగా పాగా వేయబోతోంది. మేయర్ పదవి కొనసాగింపుతో పాటు పలు హామీలు టీడీపీ నుంచి లభించడంతో నూర్జహాన్ ఇలా ప్లేటు ఫిరాయిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications