టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు- ఇవాళ పార్టీలోకి ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి ! టికెట్ హామీ..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. దీనిపై క్లారిటీ రావాలంటే ఇన్ ఛార్జ్ ల నియామకాలు, మార్పులు చేర్పులు, ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం వంటివి తప్పనిసరి అవుతున్నాయి. దీంతో టీడీపీ ఇవాళ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపబోతోంది. ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ టీడీపీలో అధికారికంగా చేరనున్నారు.

వచ్చే ఎన్నికలకు సాధ్యమైనంత త్వరగా అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని, అదీ ఈసారి ప్రత్యేక పద్ధతుల్లో ఎంపిక ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని ఆచితూచి తీసుకుంటామని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీలోకి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి)ను టీడీపీ కండువా కప్పనున్నారు. వీరితో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు కాబోతోంది.
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాకుండా మరో ఇద్దరు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు. వీరు కూడా త్వరలో అధికారికంగా పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. మేకపాటి, ఆనం, కోటంరెడ్డి ముగ్గురూ నెల్లూరు జిల్లాకే చెందిన వారు కావడంతో అందరినీ ఒకేసారి కాకుండా విడతల వారీగా చేర్చుకునే అవకాశం ఉంది.
అలాగే ఇవాళ టీడీపీలో చేరనున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అదే నియోజకవర్గం కేటాయింపుపై చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం కేటాయించనున్నట్లు సమాచారం. మిగతా వారికి కూడా టికెట్లపై హామీ లభిస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలో చేరికల పర్వం కొనసాగేలా కనిపిస్తోంది. ఇవి పూర్తయ్యాక చంద్రబాబు అసెంబ్లీ టికెట్ల ప్రకటన చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications