పులివెందుల, ఒంటిమిట్టలో తొలి ఫలితాలు..! ఆధిక్యంలో వీరే..!
ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేపిన ఉమ్మడి కడప జిల్లా జడ్పీటీసీ ఉపఎన్నికల స్ధానాలు పులివెందుల, ఒంటిమిట్టలో ఇవాళ ఉదయం గట్టి భద్రత మధ్య కౌంటింగ్ ప్రారంభమైంది. పోలైన ఓట్లను వర్గీకరించి అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో అధికార టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. పులివెందులతో పాటు ఒంటిమిట్ట స్ధానంలోనూ టీడీపీ అభ్యర్ధులు ఆరంభ ఆధిక్యాల్ని అందుకున్నారు. దీంతో తుది ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది.
పులివెందు జడ్పీటీసీ స్ధానంలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ముందంజలో ఉన్నారు. ఆమెతో పోటీ పడిన వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి వెనుకబడ్డారు. అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ స్ధానంలోనూ తొలిరౌండ్ లో టీడీపీ అభ్యర్థి ముద్దు క్రిష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీలో వెనుకబడ్డారు. తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్ధి ముద్దు క్రిష్ణారెడ్డికి 4,632 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్ధి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి కేవలం 1,211 ఓట్లు పోలయ్యాయి.

పులివెందుల జడ్పీటీసీ స్ధానంలో 74 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంటిమిట్టలో 86 శాతం ఓట్లు పోలయ్యాయి. పులివెందుల జడ్పీటీసీ ఓట్లను ఒకే రౌండ్ లో 10 టేబుళ్లపై లెక్కిస్తున్నారు. అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఓట్లను మూడు రౌండ్లలో 10 టేబుళ్లపై లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ కౌంటింగ్ ను బహిష్కరించి దూరంగా ఉండిపోయింది. ఈ రెండు చోట్ల పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధులు హేమంత్ రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఈ ఎన్నికల్లో అక్రమాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

పులివెందుల, ఒంటిమిట్ట రెండు జడ్పీటీసీ ఉపఎన్నికల సీట్లు ఉమ్మడి కడప జిల్లాలో ఉండటం, పులివెందుల సీటు అయితే జగన్ ఎమ్మెల్యే స్ధానం పరిధిలో ఉండటంతో టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో పోలింగ్ రోజు పోలీసుల సాయంతో అడుగడుగునా ఓటర్లను అడ్డుకున్నారని, రిగ్గింగ్ చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే టీడీపీ మాత్రం గతంలో ఎన్నడూ లేనంతత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, అది ఓర్చుకోలేకే వైసీపీ ఆరోపణలు చేస్తోందని కౌంటర్ ఇస్తోంది.












Click it and Unblock the Notifications