టీడీపీ, జనసేన పొత్తు - మారుతున్న విజయవాడ రాజకీయం..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. విజయవాడ కేంద్రంగా వైసీపీ వర్సస్ టీడీపీ ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయి. ఇక్కడ పట్టు నిలుపుకొనేందుకు వైసీపీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అటు టీడీపీ పూర్వ వైభవం కోసం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. జనసేనతో పొత్తు ఖాయం కావటంతో కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ సమయంలోనే విజయవాడ ఎంపీ సీటుతో పాటుగా లోక్ సభ పరిధిలోని సీట్ల పైన ఆసక్తి చర్చ సాగుతోంది.
మారుతున్నసమీకరణాలు : 2019 ఎన్నికల్లో క్రిష్ణా జిల్లాలో టీడీపీ రెండు సీట్లకే పరిమితం అయింది. నారా లోకేశ్ యువగళం యాత్ర వేళ విజయవాడ టీడీపీ రాజకీయం పైన ఒక క్లారిటీ వచ్చింది. ఇక, జనసేనతో పొత్తు వేళ నగరంలోని మూడు సీట్లతో పాటుగా విజయవాడ లోక్ సభ పరిధిలోని సీట్ల విషయంలో రెండు పార్టీల్లోనూ చర్చ సాగుతోంది.

ఎంపీ విషయంలో కేశినేని నాని తిరిగి పోటీకి సిద్దంగా లేనని గతంలో చెప్పినా..కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినాయకత్వం సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సెంట్రల్ సీటు కోసం జనసేన నుంచి ప్రతిపాదన వచ్చినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది, అయితే, రెండు పార్టీల నుంచి సెంట్రల్ సీటు కోసం ఆసక్తి చూపిస్తుండంతో తుది నిర్ణయం అధినేత సమక్షంలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది.
టీడీపీ - జనసేన పొత్తుతో : చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉండటంతో సీట్ల కసరత్తు పెండింగ్ లో పడింది. విజయవాడ నగరంలోని మూడు సీట్లలో ఒకటి జనసేనకు ఖాయమని చెబుతున్నారు. ఎంపీ విషయంలో మాత్రం టీడీపీకే సీటు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఎంపీ కేశినేని నాని లోకేశ్ యాత్రకు పూర్తిగా దూరంగా ఉండగా..కేశినేని చిన్ని కీలకంగా వ్యవహరించారు. జిల్లా యాత్ర నిర్వహణ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించారు.
చిన్ని బాధ్యతలు తీసుకున్న కారణంగానే నాని దూరంగా ఉన్నారనే ప్రచారం పార్టీలో జరిగింది. కేశినేని చిన్నికి వచ్చే ఎన్నికల్లో సీటు లేదా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల నాటికి మరింత పట్టు పెంచుకొనేందుకు చిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

వైసీపీ కొత్త వ్యూహాలు : విజయవాడ తూర్పు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ కు తిరిగి సీటు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి తూర్పు అభ్యర్దిగా దేవినేని అవినాశ్ పోటీలో నిలవనున్నారు. అదే విధంగా సెంట్రల్, పశ్చిమం లోనూ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో ఈ ఇద్దరినీ కొనసాగించే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇక, వైసీపీ నుంచి లోక్ సభ ఎంపీ అభ్యర్దిగా ఈ సారి బీసీ వర్గాలకు చెందిన వారిని బరిలోకి దించుతారని తెలుస్తోంది. ఇందు కోసం ఇప్పటికే సర్వేలు చేయించినట్లు సమాచారం. ఇక, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పీవీపీ ఇప్పుడు టీడీపీకి మద్దతుగా ఉంటున్నారు. టీడీపీ, వైసీపీకి ప్రతిష్ఠాత్మక పార్లమెంటరీ నియోజకవర్గం కావటంతో రానున్న రోజుల్లో ఇక్కడ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications