పులివెందుల నుంచి మరో టీడీపీ బాణం - హోరాహోరీ పోరులో గెలుపు..!!
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం సాధించింది.
ఏపీలో రాజకీమ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందింది. టీడీపీ గెలిచిన మూడు స్థానాల్లో ఒకటి ఉత్తరాంధ్ర కాగా, మరో రెండు రాయలసీమ స్థానాలు.
పశ్చిమ రాయలసీమలో తుది ఫలితం వరకు ఉత్కంఠ కొనసాగింది. రెండో ప్రాధాన్యత ఓట్లతో చివరకు టీడీపీ అభ్యర్ది గెలుపొందారు. ఈ ఎన్నికలో విజయం తో పులివెందుల నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్సీ సభలో అడుగు పెడుతున్నారు.

ఉత్కంఠ పోరులో విజయం
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపు దక్కించుకున్నారు. వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల మెజార్టీ సాధించారు. 3 రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చివరకు టీడీపీ అభ్యర్థినే విజయం వరించింది.
ఈ నియోజకవర్గ ఎన్నిక ఫలితం పైన తొలి నుంచి చివరికి ఫలితం సమయంలోనూ ఉత్కంఠ కొనసాగింది. మొదటి ప్రాధాన్య ఓటులో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 1,13,224 ఓట్లు రావాలి. తొలి ప్రాధాన్యం కింద వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డికి 95,969 ఓట్లు మాత్రమే వచ్చాయి.
అగ్రస్థానంలో ఉన్న ఆయన గెలిచేందుకు మరో 17,255 ఓట్లు అవసరమయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్లతో చివరకు టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు.

పులివెందుల నుంచి మరో ఎమ్మెల్సీ
ఈ ఎన్నికలో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. లివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలానికి చెందిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి మండలిలో అడుగు పెడుతున్న రెండో నేత. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నాడు పోటీ చేసిన దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి పైన బీటెక్ రవి గెలుపొందారు.
ఇప్పుడు పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి టీడీపీ పులివెందుల నియోజకవర్గానికి చెందిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని బరిలో దింపింది. రెండో ప్రాధాన్యత ఓటు బదిలీ అయ్యేలా పీడీఎఫ్ తో టీడీపీ చేసుకున్న ఒప్పందం విజయానికి దోహదం చేసింది. ఇప్పుడు పులివెందుల నుంచి మరో ఎమ్మెల్సీ టీడీపీ నుంచి గెలవటంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
అర్ద్రరాత్రి హై టెన్షన్
వైనాట్ పులివెందుల అంటూ నినాదాలు చేశారు. కడపలో ఐటీఐ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. విజయం ఖరారైనా..గెలుపు ధ్రువీకరణపత్రం అర్ద్రరాత్రి వరకు ఇవ్వకపోవటం పైన టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను స్టేషన్ కు తరలించారు. ఇదే సమయంలో ఓట్ల లెక్కింపులో తనకు అన్యాయం జరిగిందని.. రీకౌంటింగ్ చేపట్టాలని వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
ఒకే బండిల్‌లో ఆరు ఓట్లు తేడా వచ్చాయని, టీడీపీకి వేసిన మరో బండిల్‌లో 50 ఓట్ల బదులు 70 ఉన్నాయని తెలిపారు. కౌంటింగ్‌లో అవకతవకలపై రిటర్నింగ్ అధికారి(ఆర్.వో), కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేసినా ఆమె తిరస్కరించారు.












Click it and Unblock the Notifications