చంద్రబాబు నమ్మించి మోసం చేశారు - దేవినేని
టికెట్ల రగడ టీడీపీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. అభ్యర్థుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, జనసేనలతో పొత్తు వల్ల చాలామంది టీడీపీ నాయకులకు టికెట్లు దక్కని పరిస్థితి. మరోవైపు గంటా, దేవినేని ఉమ, ఆలపాటి వంటి సీనియర్ నేతలకు చంద్రబాబు టికెట్లు కేటాయించలేదు. దీంతో టీడీపీలో అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. తెనాలి టికెట్ జనసేనకు కేటాయిండాన్ని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి తప్పుపట్టారు.
కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నుంచి నాకు విముక్తి కల్పించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటి , రెండు రోజుల్లో ఆయన రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా పెనమలూరు నియోజకవర్గంలో కొత్త పంచాయితీ మొదలైంది. సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ పేరును ప్రకటించారు. దీంతో పెనమలూరు పంచాయితీ ముగిసిపోయిందని టీడీపీ నాయకులంతా భావించారు.

కానీ తాజాగా నియోజకవర్గంలో కొత్త సమస్య మొదలైంది. బోడే ప్రసాద్‌కు టికెట్ కేటాయించడంపై చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవినేని స్మిత మాట్లాడుతూ..చంద్రబాబు , లోకేష్ మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారన్నారు. 2009 ఎన్నికల్లో మా తండ్రి ఓటమికి టీడీపీనే కారణమని ఆరోపించారు. సొంత పార్టీ నాయకులే నా తండ్రిని ఓడించారని గుర్తు చేశారు.
నాన్న చనిపోయిన తరువాత పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని.. కానీ ఏనాడు మాకు తోడుగా నిలబడింది లేదని చంద్రబాబుపై దేవినేని స్మిత విమర్శలు చేశారు. 2014,2019 ఎన్నికల్లో మాకు టికెట్ ఇవ్వలేదు. ఈసారి టికెట్ ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని.. లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేశామన్నారు.

కానీ ఇప్పుడు టికెట్ బోడే ప్రసాద్‌కు కేటాయించారని.. అసలు ఆయనకు ఏరకంగా పెనమలూరు సీటును కేటాయిస్తారని చంద్రబాబు, లోకేష్‌లను ఆమె ప్రశ్నించారు. టికెట్ లేదని తెలియగానే బోడే ప్రసాద్ మీడియా ముందుకు వచ్చి ఏడ్చారు..పార్టీని బ్లాక్ మెయిల్ చేశారు..మేం ఆయనలా పార్టీ పరువు తీయలేదు కదా..? మాకు ఇచ్చే విలువ ఇదేనా ..? అంటూ చంద్రబాబుపై దేవినేని స్మిత మండిపడ్డారు. ఎన్నికల్లో బోడే ప్రసాద్‌కు సహకరించేది లేదని స్మిత తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications