బీహార్ ఎఫెక్ట్..! టీడీపీ అనూహ్య నిర్ణయం..! ఈసీకి ముందస్తు కళ్లెం ?
ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయింది. మరో నాలుగేళ్ల వరకూ సార్వత్రిక ఎన్నికలు లేవు. జమిలిపై ఊహాగానాలు వెలువడుతున్నా ఇప్పటికీ క్లారిటీ లేదు. అయినా రాష్ట్రంలో అధికార టీడీపీ ఇవాళ హఠాత్తుగా కీలక అడుగు వేసింది. ఢిల్లీలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ పార్లమెంటరీ పార్టీ బృందం కలిసింది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోపు చేపట్టాల్సిన ఓ కీలక ప్రక్రియకు సంబంధించి కీలక సూచనలు చేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది.
ప్రస్తుతం బీహార్ లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కేవలం రెండు నెలల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఇందులో భారీగా ఓ వర్గం ఓట్లను తొలగిస్తున్నారు. పైకి బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశీయుల ఓట్లను మాత్రమే తొలగిస్తున్నట్లు చెబుతున్నా ఇప్పటీకీ రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు, మార్పులు చేర్పులపై అధికార ఎన్డీయే కూటమే ఉలిక్కి పడుతోంది. సుప్రీంకోర్టు కూడా దీనిపై జోక్యం చేసుకుని ఈసీకి పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ స్ధాయిలో ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఇవాళ ఈసీని ఆశ్రయించింది.

ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ఓటర్ల జాబితాల సవరణ కోసం ఈసీని కలిసిన టీడీపీ ఎంపీల బృందం పలు సూచనలు చేసింది. ఇందులో ప్రతీ ఏటా ఓటర్ల జాబితాలపై కాగ్ తో ధర్డ్ పార్టీ ఆడిట్ జరిపించాలని, ఏఐ సాయంతో నకిలీ, వలసదారుల, చనిపోయిన వారి ఓట్లు రియల్ టైమ్ లో తొలగించాలని కోరింది. ఆధార్ సాయంతో డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరింది. ఓటర్ల జాబితాల సవరణలో అన్ని గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధుల్ని భాగస్వాముల్ని చేయాలని, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు బీఎల్వోలకు సమాచారం ఇవ్వాలని కోరింది.
ఈసీ వెబ్ సైట్ లో జిల్లాల వారీగా ఓటర్ల మార్పులు చేర్పుల వివరాలు, వాటి కారణాలను అప్ లోడ్ చేయాలని కోరింది. అలాగే ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని రియల్ టైమ్ లో పరిష్కరించడానికి డ్యాష్ బోర్డులు నిర్వహించాలని కూడా కోరింది. ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియలో తప్పుచేస్తే బాధ్యుల్ని చేసేలా చర్యలు ఉండాలని తెలిపింది. స్థానికంగా పక్షపాతం చూపకుండా బూత్ లెవెల్ ఎన్నికల అధికారుల రొటేషన్ చేయాలని కోరింది. రాష్ట్రస్దాయిలో పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం ఓ అంబుడ్స్ మెన్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరింది.

నివాసం లేని వారు, వలస కార్మికులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కూడా కోరింది. వీరి కోసం నామమాత్రపు ఆధారాలతో అయినా తాత్కాలిక అడ్రస్ ఇచ్చేలా చూడాలని కోరింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో నెలకోసారి ఓటర్ల జాబితాలపై సమీక్ష నిర్వహించాలని కూడా సూచించింది. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల సవరణకు తగిన సమయం ఇవ్వాలని, ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారు మళ్లీ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండా చూడాలని, సమగ్ర విచారణ లేకుండా ఓట్లను తొలగించకూడదని, ఓటరు గుర్తింపు ఆధారాల్ని తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉండాలని, ఓటర్లపై కాదని తెలిపింది. అలాగే సవరణ పరిధి తెలియాలని, మొబైల్ బీఎల్వో యూనిట్లు ఏర్పాటు చేసి వలస కార్మికులకు తాత్కాలికంగా అయినా ఓటు హక్కు కల్పించాలని, ఓట్ల తొలగింపుకు సమగ్ర విచారణ చేయాలనీ కోరింది.












Click it and Unblock the Notifications