కీచక టీచర్: విద్యార్ధి పీక పట్టుకుని పైకెత్తాడు
హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్ధి గొంతు నులిమి కొట్టిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని చిట్టమూరు మండలంలోని గునపాడు గ్రామంలోని పాఠశాలలో జరిగింది. గ్రామస్తులు, పాఠశాల విద్యార్ధుల కథనం ప్రకారం... పాఠశాలలో పదో తరగతిలో హిందీ సిటబస్ పూర్తి కాలేదని కొందరు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు.
అంతేకాకుండా హిందీ పండిట్ శంకరయ్య క్లాస్ రూంలో విద్యార్ధులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ విషయాలను గ్రామంలోని అందరికి చెప్పాడనే కోపంతో పదో తరగతి విద్యార్ధి పైడి చెంచయ్యను పీక పట్టుకుని పైకెత్తి కింద పడేశాడని తోటి విద్యార్ధులు చెప్పారు.

దీంతో ఆగకుండా పైడి చెంచయ్యను తీవ్రంగా కొట్టాడు. చెంచయ్య గొంతు వద్ద తీవ్ర గాయం అవడంతో మాట్లాడలేని పరిస్ధితిలో ఉన్నాడు. గాయాలైన చెంచయ్యని గ్రామంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్, విద్యా కమిటీ చైర్మన్ కస్తూరయ్య, తల్లిదండ్రులు టీచర్‌ని నిలదీశారు.
విద్యార్ధులకు చదువు చెప్పకుండా ఇలా విద్యార్థుల పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యుయుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుడు విద్యార్ధి పట్ల ప్రవర్తించిన తీరు సరైనది కాదన్నారు. పాఠశాలలో సిబ్బంది కొరత వల్ల సిలబస్ పూర్తికాలేదని నిజమేనన్నారు. ఉపాధ్యాయుడుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications