గురు సాక్షాత్ పరబ్రహ్మ... తస్మైశ్రీ గురువే నమః
గురువు లేని విద్య రాణించదు. అలాగే గురువు లేని జీవితం కూడా వ్యర్థమవుతుంది. ఒక గడ్డిపరకను, ఎండు మొక్కను, కట్టె పుల్లనైనా గురువుగా భావించి ఆదేశాలు పాటిస్తే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది. తల్లిదండ్రుల తర్వాత భగవంతుడికి కూడా ఇవ్వని స్థానాన్ని మన పురాణాలు గురువుకు ఇచ్చాయి. గురువు లేనిదే విద్య ఉండదు.. విద్య లేనిదే జ్ఞానం రాదు.. జ్ఞానం నేర్వకపోతే లోకంలో మనుగడే ఉండదు. అందుకే విజ్ఞానం కన్నా జ్ఞానానికే ప్రథమ ప్రాధాన్యత దక్కింది.

అజ్ఞానాన్ని పోగొట్టేవారే గురువు
ఆ జ్ఞానం మనం నేర్చుకోవాలంటే గురువు అవసరం. గురులో గు అంటే చీకటి, రు అంటే అజ్ఞానం.. గురు అంటే మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించి వెలుగును ప్రసరింపచేసేవారే గురువు. మన దేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిరోజైన సెప్టెంబరు 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. 1888 సెప్టెంబరు ఐదోతేదీన తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగు దంపతులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ కు తిరుత్తణిలో జన్మించారు. గొప్ప విజ్ఞానవంతుడైన సర్వేపల్లి 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి, 16 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి నామినేట్ అయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు శ్రీ కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పారు.

ఎందరో మహోన్నత ఉపాధ్యాయుల నివాళులే సర్వేపల్లి జయంతి
మనలో ఉన్న ప్రతిభా పాటవాలను గుర్తించి వాటికి మెరుగులు దిద్ది ఉన్నతమైన భవితవ్యానికి బాటలు వేస్తారు. నిరంతరం తనను తాను మలచుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ ఉండే ఉపాధ్యాయులు మంచి పౌరులను తయారుచేస్తారు. అందుకే తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టం, గౌరవమని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. 1965లో డాక్టర్ సర్వేపల్లిని ఆయన జన్మదినం సందర్భంగా సన్మానించడానికి విద్యార్థులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. తన ఒక్కడినే ఇలా సత్కరించే బదులు తన జన్మదినోత్సవం రోజు ఇతర గొప్ప ఉపాధ్యాయులకు నివాళులర్పిస్తే తాను సంతోషిస్తానని చెప్పారు. దీంతో 1967 సెప్టెంబరు 5వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఆ తేదీరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

ఆచార్య దేవో భవ అన్నారు!
పుట్టిన బిడ్డకు ప్రపంచాన్ని పరిచయం చేసే అమ్మ మొదటి గురువైతే, ఆ ప్రపంచానికి నిన్ను పరిచయం చేసే నాన్న రెండో గురువవుతారు. తర్వాత విద్యాబుద్ధులతోపాటు ఈ లోకంలో ఎలా జీవించాలో చెప్పేవారు గురువవుతారు. అందుకే మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవో భవ అన్నారు. ఆధ్యాత్మిక విద్యలో గురువుమీద పూర్తిస్థాయి విశ్వాసం ఉంచినవారు ఆ దైవాన్ని చేరుకుంటారు. కానీ అది అంత తేలికగా లభించేదికాదు. మీకు విశ్వాసం ఉందా? సడలుతోందా?
దృఢంగా ఉందా? పరీక్షించిన తర్వాతే సద్గురువు మీకు ఉన్నతిని ప్రసాదిస్తారు. గురువుమీద మీ విశ్వాసం సడలకుండా చూసుకోవడంలోనే జీవిత పరమార్థం దాగివుంటుంది.












Click it and Unblock the Notifications