వన్డేల్లో విజయవాడ క్రికెటర్ తేజ నిడమానూరు తొలి సెంచరీ: కావ్యా పాప కంట్లో పడినట్టే
విజయవాడ క్రికెటర్ అనిల్ తేజ నిడమానూరు అదరగొట్టాడు. నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్నాడీ డాషింగ్ ప్లేయర్. జింబాబ్వేపై జరిగిన వన్డేలో సెంచరీతో తన జట్టును గెలిపించాడు.
అమరావతి: వన్డే ఇంటర్నేషనల్స్ లో తెలుగు క్రికెటర్ అదరగొట్టాడు. సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్ల విరుచుకుపడ్డాడు. వారి దుమ్ము దులిపాడు. తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ తో తన కేరీర్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. అతని బ్యాటింగ్ ధాటికి బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. భారీగా పరుగులను సమర్పించుకున్నారు బౌలర్లు. అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడిన అనుభవం తక్కువే అయినప్పటికీ ప్రొఫెషనల్ ఆటతీరును కనపర్చాడు.

అదరగొట్టిన తేజ..
ఆ బ్యాటర్ పేరు అనిల్ తేజ నిడమానూరు (Teja Nidamanuru). అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటీవలే అడుగు పెట్టాడు. నెదర్లాండ్స్ కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. నెదర్లాండ్స్ జాతీయ జట్టులో ఆల్ రౌండర్. అతని స్వస్థలం... విజయవాడ (Vijayawada). కుడిచేతి వాటం బ్యాటర్. కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. ఇప్పటివరకు తొమ్మిది వన్డే ఇంటర్నేషనల్స్, ఆరు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. వన్డేల్లో తొలి సెంచరీని నమోదు చేశాడు.

249 పరుగులకు..
ప్రస్తుతం నెదర్లాండ్స్ (Netherlands vs Zimbabwe) జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇవ్వాళ హరారే క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి వన్డేలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే (Zimbabwe) జట్టు 47.3 ఓవర్లల్లో 249 పరుగులకు ఆలౌట్ అయింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ క్లైవ్ మదాండే టాప్ స్కోరర్. 74 పరుగులు చేశాడు. సికందర్ రజా-22, వెల్లింగ్టన్ మసకద్జా-34, రిచర్డ్ ఎంగరవ- 35 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ జట్టులో ఫ్రెడ్ క్లాసెన్ 41 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. పాల్ వాన్ మీకెరన్ 2 వికెట్లతో రాణించాడు.

250 టార్గెట్ తో..
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. 31.1 ఓవర్లల్లో 110 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఏ దశలో కూడా నెదర్లాండ్స్ గెలిచే అవకాశాలు కనిపించలేదు. ఆ సమయంలో క్రీజ్ లో ఉన్న తేజ నిడమానూరు (Teja Nidamanuru) చెలరేగాడు. జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. 114.58 స్ట్రైక్ రేట్ తో దూకుడుగా సాగింది అతని బ్యాటింగ్.

తొలి సెంచరీ..
96 బంతుల్లో 110 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు తేజ. అతని ఇన్నింగ్ లో మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. తొమ్మిది మెరుపుల్లాంటి ఫోర్లు బాదాడు. నెదర్లాండ్స్ గెలవడానికి చివరి రెండు ఓవర్లల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో ఏ మాత్రం ఒత్తిడికి లోను కాలేదతను. ముజరబనీ వేసిన 49వ ఓవర్ లో ఒక సిక్సర్, ఒక ఫోర్ తో 15 పరుగులను పిండుకున్నాడు.

ఇంటర్నేషనల్స్ లో సత్తా..
చివరి ఓవర్ లో అయిదో బంతిని ఇవాన్స్ సిక్స్ గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. సెంచరీతో నాటౌట్ గా నిలిచిన తేజ నిడమానూరుకు మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ అవార్డు దక్కింది. ఇప్పటివరకు తేజ పాకిస్తాన్-3, న్యూజిలాండ్ -1, జింబాబ్వే-2, ఇంగ్లాండ్ -2, వెస్టిండీస్-1, పపువా న్యూగినియా-1 మ్యాచ్ లను ఆడాడు. తొమ్మిది మ్యాచ్ లల్లో 250 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు.












Click it and Unblock the Notifications