ఏపీపై తెలంగాణ ఎఫెక్ట్-ఆ కార్డులపై మోడీ ఫొటోకు కేంద్రం పట్టు-జగన్ సర్కార్ ఓకే
ఈ మధ్య తెలుగు రాష్ట్రాలతో పాటు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కేంద్రమంత్రులు వరుస పర్యటనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని మోడీ ఫొటోలు లేకపోవడంపై మండిపడుతున్నారు. తాజాగా తెలంగాణలో పర్యటించిన ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ కూడా రేషన్ షాపుల్లో మోడీ ఫొటోలకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభావం ఏపీపై పడినట్లు కనిపిస్తోంది. గతంలో ఓసారి ఏపీలో పర్యటించిన కేంద్రమంత్రి భారతీ పవార్ మోడీ ఫొటో లేదంటూ వ్యక్తం చేసిన అభ్యంతరాలతో వైసీపీ సర్కార్ ఇరుకునపడింది.చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు.

మోడీ ఫొటో రాజకీయం
కేంద్ర ప్రభుత్వ పథకాల సంఖ్య తగ్గిపోతోందని రాష్ట్రాలు ఓవైపు గగ్గోలు పెడుతుంటే పట్టించుకోని ఎన్డీయే సర్కార్, అందులో మంత్రులు.. ఇప్పుడు రాష్ట్రాల్లో తిరుగుతూ ఇస్తున్న పథకాలకు సైతం మోడీ ఫొటో పెట్టాలంటూ పట్టుబడుతున్నారు. ముఖ్యంగా వచ్చే రెండేళ్లలో ఎన్నికలు జరగాల్సిన తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి చాటుకునేలా మోడీ ఫొటో పెట్టాల్సిందేనంటూ విపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఆయా ప్రభుత్వాలు ఇరుకునపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇప్పటికే కౌంటర్లు వేస్తుండగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్రంతో పోరుకు సిద్ధంగా లేదు.

ఆయుష్మాన్ భారత్ కార్డులపై
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులపై మోడీ ఫొటో పెట్టి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముందు సిద్ధం కాలేదు. ఆయుష్మాన్ భారత్ ప్రచారంలోనూ జగన్ ఫొటోలు మాత్రమే ముద్రించారు. దీంతో రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఆరోగ్యమంత్రి భారతీ పవార్ మోడీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని రాష్ట్ర అధికారుల్ని ప్రశ్నించారు. దీంతో వారు ఇరుకునపడ్డారు. దీంతో ఢిల్లీలో తాజాగా జరిగిన ఓ భేటీలో ఆయుష్మాన్ భారత్ కార్డులపై మోడీ ఫొటో వ్యవహారం చర్చకు వచ్చింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తమ స్టాండ్ ఏంటో చెప్పేసింది.

మోడీ ఫొటోకు జగన్ గ్రీన్ సిగ్నల్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏపీలో లబ్దిదారులకు ఇచ్చే కార్డులపై ప్రధాని మోడీ ఫొటో పెట్టేందుకు వైసీపీ సర్కార్ అంగీకరించింది. రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు ఈ కార్డుల ద్వారా లబ్ది చేకూరబోతోంది. దీంతో ఇంత భారీ ఎత్తున చేపడుతున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో జగన్ ఫొటోతో పాటు మోడీ ఫొటో కూడా పెట్టేందుకు వైసీపీ సర్కార్ తరఫున అధికారులు అంగీకరించారు. దీంతో ఏపీలో ఇకపై జారీ చేసే ఆయుష్మాన్ భారత్ కార్డులపై మోడీ ఫొటోలు కూడా దర్శనమివ్వబోతున్నాయి. కేంద్రంతో జగన్ సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం అమలు ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications