రాజధానిలేని ఏపీ, కొత్త టి: కేసీఆర్, బాబు ఎదురుచూపు
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేడు (గురువారం) బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాయి. రెండు రాష్ట్రాల అధికార పార్టీలు తమ తమ రాష్ట్రాలకు సాధ్యమైనంత ఎక్కువ కేటాయింపులను ఆశిస్తున్నారు.
విభజన నేపథ్యంలో.. తెలంగాణ కొత్త రాష్ట్రమైనందున తమకు కేటాయింపులు ఎక్కువగా ఉండాలని తెరాస ప్రభుత్వం, రాజధాని లేకపోవడం, లోటు బడ్జెట్ తదితర కారణాలతో తమకు కేటాయింపులు ఎక్కువగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవలే అరుణ్ జైట్లీని కలిశారు. తెలంగాణకు ఏమేం కావాలో ఆయన ఓ వినతి పత్రం ఇచ్చారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు నిధులు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలాగే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఈటెల రోరారు. కొత్త రాష్టమైనందున ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ బడ్జెట్ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్, ఐఐఎం, ఏఐఐఎం, గంగా శుభ్రతకు నిధులు కేటాయిస్తున్నట్లుగా మూసీ నదిని శుభ్రం చేసేందుకు నిధులు.. తదితరాలను కేసీఆర్ ఆశిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా భారీగానే బడ్జెట్ పైన ఆశలు పెట్టుకుంది. ఎన్డీయేలో టీడీపీ భాగస్వామి కావడం గమనార్హం. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని, దీనిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌లో ఏపీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఐఐఎం, ఏఐఐఎం, స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టు తదితరాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లింది.












Click it and Unblock the Notifications