ఈ నెల్లో టి బిల్లు, కిరణ్, చిరుల ఎదుటే చెప్పారు: బొత్స
హైదరాబాద్: తెలంగాణ బిల్లును ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి పంపిస్తామని సమన్వయ కమిటీ భేటీలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం చెప్పారు.
అసెంబ్లీకి బిల్లు ఈ నెలలోనే వస్తుందనే విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిల ఎదుటే డిగ్గీ చెప్పారన్నారు.

రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించిందని అయితే కిరణ్ మాత్రం మండల కేంద్రాల్లో నిర్వహించాలని నిర్ణయించారన్నారు. మంత్రి బాలరాజు వ్యవహారంలో సమాచార లోపం ఉందన్నారు. ఇటీవల విశాఖ జిల్లా కిరణ్ రచ్చబండ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని బాలరాజు చెప్పిన విషయం తెలిసిందే.
గాంధీ భవన్‌లోని ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రాక పోవడంపై బొత్స స్పందించారు. కిరణ్ నిన్నటి వరకు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నందున తాము ఆయనను ఆహ్వానించలేకపోయామని ఈ కారణంగానే ఆయన రాలేదన్నారు.












Click it and Unblock the Notifications