దారితప్పిన కెసిఆర్ ఎస్కార్ట్ వాహనాలు: వరదలో బాబు
హైదరాబాద్/శ్రీకాకుళం: హుస్సేన్‌సాగర్ పరిశీలనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కాన్వాయ్‌లో గందరగోళం చోటు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, జలవిహార్, సుందరయ్య పార్కులను సిఎం కెసిఆర్ పరిశీలించారు. ఆ తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో సిఎం వాహనానికి ముందు వెళ్తున్న ఎస్కార్ట్ వాహనాలు హఠాత్తుగా ఎడమవైపునకు తిరిగి మినిస్టర్ రోడ్‌లోకి వెళ్లిపోయాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్ వాహనం మాత్రం నేరుగా బుద్ధభవన్ వద్ద యూ టర్న్ తీసుకుంది. ఎస్కార్ట్ సిబ్బంది తేరుకుని సిఎం కాన్వాయ్‌ను అందుకునేందుకు ప్రయత్నించారు. కాగా, అప్పటికే సిఎం కారు ముందుకు వెళ్లిపోయింది. దీంతో ముఖ్యమంత్రి వాహనం ముందు ఉండాల్సిన ఎస్కార్ట్ వాహనాలు ఆయన కారును అనుసరించాల్సి వచ్చింది.

వరదనీటిలో చిక్కుకున్న చంద్రబాబు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శ్రీకాకుళం జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధితులను పరామర్శించారు. కాగా, మొదలవలస-కింతలి మధ్య సిఎం చంద్రబాబు ప్రయాణించిన ట్రాక్టర్ వరదనీటిలో చిక్కుకుపోయింది. అయితే అక్కడే ఉన్న గ్రామస్తుల సాయంతో చంద్రబాబు వరదనీటి నుంచి బయటపడ్డారు.
శ్రీకుకుళం పర్యటన చంద్రబాబు మాట్లాడుతూ.. చరిత్రలో చూడని తుఫానును చూశామని అన్నారు. విశాఖ కోలుకోలేని భారీ నష్టాన్ని చవిచూసిందని అన్నారు. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్దరిస్తామని చెప్పారు. ఒడిశా రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ఇచ్ఛాపురం, పాతపట్నం పరిసర ప్రాంతాలకు అందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
అంతకుముందు చంద్రబాబు విజయనగరం జిల్లాలో తుఫాను బాధితులను పరామర్శించారు. భోగాపురం మండలం దిబ్బలపాలెంలో తుపాను బాధితులను సీఎం పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బాధితులకు ధైర్యం చెబుతూ.. బాబు ముందకు సాగారు. తుపాను ధాటికి విరిగిపోయిన ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ. వెయ్యి చెప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. మళ్లీ కొబ్బరి తోటలు పెంచుకునేందుకు రుణాలు కూడా ఇస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications