ఢిల్లీలో కెసిఆర్ భేటీ: నరేంద్ర మోడీకి కోర్కెల చిట్టా
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆయన వద్ద తన కోరికల చిట్టాను విప్పారు. ప్రాణహిత - చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని, ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని, తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కెసిఆర్ మోడీని కోరారు.

తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు ఆర్థిక సాయం అందించాలని, తెలంగాణకు 500 మెగావాట్ల విద్యుత్తును కేటాయించాలని, తెలంగాణలో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టు నిర్మించాలని ఆయన కోరారు. విద్యుత్తు, విద్యారంగాలకు చెందిన విషయాలపై కెసిఆర్ మోడీకి తన విన్నపాలను చెప్పుకున్నారు. ఎన్టీపిసికి అవసరమైన విద్యుత్తు కేటాయించాలని కూడా ఆయన ప్రధానిని కోరారు.

తాము చెప్పిన రాష్ట్ర సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ శ్రద్ధగా విన్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెటు సభ్యుడు జితేందర్ రెడ్డి చెప్పారు. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మోడీ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. కెసిఆర్‌తో కలిసి ప్రధానిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
త్వరలో హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ మెట్రో పోలీస్ సదస్సు ప్రారంభోత్సవకార్యక్రమానికి కెసిఆర్ ప్రధానిని ఆహ్వానించారు. ఐఐఎం ఏర్పాటుకు కూడా మోడీ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు జితేందర్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నుంచి పూణే వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని, కాజిపేటలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కెసిఆర్ మోడీకి విన్నవించారు.












Click it and Unblock the Notifications