రేవంత్ రెడ్డితో భేటీ వేళ చంద్రబాబుకు ఆ ఉద్యోగుల డిమాండ్..!
ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలో భేటీ కాబోతున్నారు. ఈ నెల 6న హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో వీరిద్దరి భేటీకి ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు సీఎం చంద్రబాబు ముందు ఓ కీలక డిమాండ్ పెట్టారు. సుదీర్ఘకాలంలో ఎదురుచూస్తున్న ఓ అంశంపై రేవంత్ రెడ్డితో జరిగే భేటీలో చంద్రబాబు దీన్ని చర్చించి ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఏపీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 712 మంది ఉద్యోగులు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. వీరిని విభజన తర్వాత ఆ రాష్ట్రానికి పంపేయాల్సి ఉండగా ఆంధ్రలో ఏర్పడిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వారు పదేళ్లకు పైగా ఇక్కడే మగ్గుతున్నారు. తమ స్వరాష్ట్రానికి పంపేయాలని వారు కోరుతున్నా ప్రభుత్వాల నుంచి స్పందన కరవైంది. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానుండటంతో వీరి అజెండా మరోసారి తెరపైకి వచ్చింది.

అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న సచివాలయంతో పాటు హెచ్వోడీ కార్యాలయాల్లోనూ వందల సంఖ్యలో తెలంగాణ ఉద్యోగులు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. అయితే వీరిని విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల ప్రకారం వారి స్వరాష్ట్రానికి పంపాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వీరి సమస్య కూడా అలాగే ఉండిపోయింది. దీంతో వారు స్వరాష్ట్రంలో సీనియార్టీ కూడా కోల్పోతున్నారు. అయినా సరే తాము తెలంగాణకు వెళ్లిపోతామని, ఈ మేరకు రేవంత్ రెడ్డితో జరిగే భేటీలో చంద్రబాబు ఈ అంశాన్ని చర్చించి తమను పంపేయాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications