తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని ఖరారు చేసిన కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధం చేశారు. మొదటి మంత్రి వర్గంలో ఈ చిహ్నాన్ని ఆమోదించిన తర్వాత అధికారికంగా అమలులోకి తీసుకువస్తారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెరాస సిద్ధమవుతోంది. ఇందు కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కెసిర్ వెంటనే పరిపాలన కొనసాగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పరమైనటువంటి అంశాలన్నింటిపై ఆయన దృష్టి పెట్టారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని సిద్ధం చేశారని, ఆ చిహ్నంలో కాకతీయ కళాతోరణం, దానికింద చార్మినార్, దాని చుట్టూ తెలుగు, ఉర్దూ, ఆంగ్లభాషల్లో తెలంగాణ అనే అక్షరాలు ఉన్నాయి.

కాకతీయ కళాతోరణంపైనా భారత ప్రభుత్వ అధికార ముద్ర, నాలుగు సింహాలు, దాని కింద సత్యమేవ జయతే అక్షరాలు ఉండే విధంగా చిహ్నాన్ని రూపొందించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జరిగే మంత్రి వర్గ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ చిహ్నం అధికారికంగా అమలులోకి వస్తుంది. అప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పత్రంలో కూడా రాజ ముద్ర ఉంటుంది.
జూన్ 2వ తేదీన సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications