టి ప్రారంభం ఇలా..:'19నాటికి కెసిఆర్ లెక్క కుదిర్చేనా!?
హైదరాబాద్: అరవయ్యేళ్ల కల సాకారమైన నేపథ్యంలో.. తెలంగాణ ఇక భవిష్యత్తు పైన దృష్టి సారించింది. ఆంధ్రా పాలనలో తమకు నష్టం జరిగిందని చెప్పిన తెరాస, తెలంగాణ ప్రజలు కొత్త రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకుంటారోనని అందరిలోను ఆసక్తి నెలకొంది! పదమూడేళ్లుగా తెలంగాణ కోసం పోరుసల్పిన పార్టీయే అధికారంలోకి రావడంతో.. ఆ పార్టీ రానున్న ఐదేళ్లలో చేసే అభివృద్ధిపై అందరి దృష్టి ఉంది.
తెరాస వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుందని తెలంగాణ ఉద్యమం సమయంలో కొన్ని పార్టీలు, నాయకులు మండిపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ వచ్చినందున తెరాస ప్రభుత్వం పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తుంది? హైదరాబాద్ ప్రపంచస్థాయిలో ఎలా నిలబెడుతుంది? విద్యుత్ కష్టాన్ని ఎలా అధిగమిస్తుంది? ఉద్యోగాలు వంటి హామీలను ఎలా నెరవేరుస్తారు? అనే చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రయాణం ఎక్కడి నుండి ప్రారంభమవుతుందనేది ముఖ్యమైన విషయం. విభజన నేపథ్యంలో ఏ విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కొంచెం మెరుగ్గా ఉందని తెలుస్తోంది. ఎపి లోటు బడ్జెట్‌లో ఉంటే తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉంది. అయితే విద్యుత్, ఉద్యోగాల వంటి పలు సమస్యలను తెలంగాణ అధిగమించవలసి ఉంది. తాను కలలు కన్న బంగారు తెలంగాణను కెసిఆర్ 2019లోగా ఏ మేరకు సాకారం చేస్తారనేది చూడాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర ఆదాయం రూ.48 కోట్లకు పైగా ఉంది. కేంద్రం నుండి ఎనిమిదివేల కోట్ల రూపాయలకు పైగా వస్తుంది. రాష్ట్రం పైన అప్పు రూ.61వేల కోట్లు ఉంది. తెలంగాణకు మిగులు బడ్జెట్ మూడువేల కోట్ల రూపాయలకు పైగా ఉంది. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం 8,337 మెగావాట్లుగా ఉంది. రోజువారి వినియోగం 6,600 మెగావాట్లు. ప్రస్తుతం విద్యుత్ లోటు రెండువేల మెగావాట్లకు పైగా ఉంది. రానున్న నాలుగేళ్లలో ఇది మరింత పెరగనుంది. దీనిని అధిగమించాల్సి ఉంది.
వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి పెడతామని తెలంగాణ తొలి సిఎం కెసిఆర్ ప్రకటించారు. ప్రపంచంలోనే విత్తనాల సాగుకు హరిజోనా, తెలంగాణ రెండే అనుకూల ప్రాంతాలు అని వ్యవసాయ నిపుణులు చెప్పారని తెలిపారు. సాగుకు యోగ్యంగా ఉన్న భూమిలో దాదాపు సగానికి పైగా భూమిలో మాత్రమే పంటలు పండుతున్నాయి. భూగర్బ జలాలు, చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల ద్వారా సాగుభూమిని పెంచాలని కొత్త ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది.
సాగుభూమి పెంచడానికి ఇంకా చాలా ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉంది. దాదాపు 27 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు వేలాది కోట్ల రూపాయలు కావాలి. కేంద్రం సహకారంతో ప్రాజెక్టులను పూర్తి చేసి సాగుభూమిని పెంచాలని చూస్తోంది. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. వీటితో పాటు రహదారుల నిర్మాణం, ఆరోగ్యం.. ఇలా పలు అంశాల పైన కొత్త ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.
ఉద్యమంలో పాల్గొన్న పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఉద్యోగులకు, అమరవీరుల కుటుంబాలకు చాలా హామీలు ఇచ్చింది. వీటిని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పేద వారికి రెండు పడగ గదుల ఇళ్లు, పింఛన్లు, రైతుల రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం.. తదితర అంశాల పైన ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాల్సి ఉంది. తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాల్సి ఉంది. పలు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న వాటిని అభివృద్ధి చేయడమే కాకుండా... పర్యాటక రంగానికి అనుకూలంగా ఉన్న వాటిపై దృష్టి సారించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications