అమరావతిపై KTR పొలిటికల్ గేమ్!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మరోవైపు ప్రభుత్వం మూడు రాజధానులకు మద్దతు పలుకుతుండటంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఇటువంటి తరుణంలో తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(KTR) అమరావతిపై స్పందించారు.

తట్టెడు మట్టి.. లొట్టెడు నీళ్లు ఇవ్వలేకపోయారు
గతం నుంచి ఆయన కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వ విధానాలను, లోపాలను విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కూడా ఆయన ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. నమో అంటే నమ్మించి మోసం చేసేవారంటూ ధ్వజమెత్తారు. ఆయన్ను విమర్శిస్తూ అమరావతి ప్రస్తావన తెచ్చారు. ''దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతాపార్టీ రూపాయి కూడా ఇవ్వదని, యాదాద్రికి కనీసం వందరూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. అమరావతికి తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్ల కూడా ఇవ్వదని, ఇటువంటివారు హిందుత్వం గురించి, దేశం గురించి మాట్లాడుతున్నారని" మండిపడ్డారు.

సెటిలర్ల ఓట్ల కోసం ప్రస్తావనా?
కేటీఆర్ గతంలో కూడా తన మిత్రులు ఏపీలో ఉన్నారని, అక్కడి రోడ్ల దుస్థితిని వారు తనకు చెప్పారంటూ రాజకీయంగా కలకలం రేకెత్తించారు. ఇప్పుడు అమరావతి విషయంలో మోడీ చిన్నపాటి సహకారం కూడా అందించలేదంటూ వ్యాఖ్యానించడం వెనక రాజకీయ వ్యూహం దాగివుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లను దక్కించుకోవడానికే అమరావతి ప్రస్తావన తెచ్చినట్లుగా భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో 10 నుంచి 12వేల వరకు ఉన్న వీరి ఓట్లే కీలకం కాబోతున్నాయి.

భవిష్యత్తులో మద్దతు పలుకుతారా?
అమరావతి ప్రస్తావన గురించి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, మంత్రులుకానీ ప్రస్తావించలేదు. రాజధాని రైతులు ఉద్యమిస్తున్న సమయంలోకానీ, లాఠీఛార్జి సమయంలోకానీ ఎన్నడూ మాట్లాడలేదు. అటువంటిది ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతిని ప్రస్తావించడం వెనక సెటిలర్ల ఓట్ల కోసం వ్యూహం దాగివుందని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే అమరావతి గురించి ప్రస్తావిస్తారా? వారికి మద్దతుగా నిలుస్తారా? వారికి సంఘీభావం ప్రకటిస్తారా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.












Click it and Unblock the Notifications