వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సింగరేణి అధికారుల ఎంట్రీ-బిడ్ పై కసరత్తు మొదలు..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్నప్రయత్నాల నేపథ్యంలో ఈ చారిత్రక ప్లాంట్ స్వాధీనానికి తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులేస్తోంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ స్వాధీనానికి బిడ్ వేస్తాంటూ ప్రకటించిన కేసీఆర్ సర్కార్..ఇందులో భాగంగా సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం సింగరేణి కార్పోరేషన్ అధికారుల్ని అక్కడికి పంపింది. దీంతో వారు ఇవాళ స్టీల్ ప్లాంట్ కు వచ్చారు.
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని గతేడాది కేంద్రం నిర్ణయించింది. ఏడాదిలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా ప్రకటించింది. దీనిపై అధికారవైసీపీతో పాటు విపక్షాలు కూడా కేంద్రం వద్ద పలుమార్లు లాబీయింగ్ చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో కేంద్రం ఈ ప్లాంట్ అమ్మకం కోసం నిర్వహించే వేలంలో బిడ్ దాఖలు చేసేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈ ప్లాంట్ తీసుకోవాలనే డిమాండ్లు ఉన్నాయి. అయినా వైసీపీ స్పందించకపోవడంతో తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ముందుకొచ్చింది.

ఈ మేరకు సింగరేణి కార్పోరేషన్ లేదా తెలంగాణ నీటిపారుదల అభివృద్ధి సంస్ధ నుంచి బిడ్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఇవాళ సింగరేణి అధికారులు ప్లాంట్ కు వచ్చారు. ప్లాంట్ లో అధికారుల్ని కలిసిన వారు.. కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ, బిడ్ దాఖలుకు సంబంధించిన అంశాలపై వివరాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అదే సమయంలో ప్లాంట్ నిర్వహణ, లాభనష్టాలు, మైన్స్ కేటాయింపు వంటి అంశాలపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications