
తగ్గేదేలే..!! తెలుగుదేశం సైకిల్ స్పీడ్‌ను ఆపేదెవరు??
తెలుగుదేశం పార్టీ సైకిల్ శరవేగంతో దూసుకుపోతోంది. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ పార్టీ శ్రేణుల్లో ఉన్న హుషారును చూస్తుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అంతేకాదు.. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా మంచి జోరుమీద ఉన్నారు. 'బాదుడే బాదుడు', 'మహానాడు' ఊహించనిరీతిలో విజయవంతమవడంతో తర్వాత కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు
జిల్లాలవారీగా మినీ మహానాడును నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా తాజాగా గుడివాడలో జరగాల్సిన మినీ మహానాడు వాయిదా పడింది. అది కూడా త్వరలోనే నిర్వహించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. మూడు సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంమీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఆ విషయం తమకు స్పష్టంగా అర్థమవుతోందని రాష్ట్రం నలుమూలల నుంచి కేంద్ర కార్యాలయానికి వస్తున్న నాయకులు, కార్యకర్తలు అధినేతకు చెబుతున్నారు.

ఎన్నికలు జరిగేంతవరకు కొనసాగనున్న జోష్
పార్టీలో నెలకొన్న ఈ ఉత్సాహాన్ని ఎన్నికలు జరిగేంతవరకు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆయన ఉత్సాహంతో పనిచేస్తూ జిల్లాలవారీగా నాయకులను కూడా సమయాత్తం చేస్తున్నారు. పనిచేయడానికి ముందుకు రానివారిని, ఆర్థికంగా పార్టీని ఆదుకోవడానికి ముందుకు రానివారికి ఆయన నిర్ధాక్షిణ్యంగా ''నో'' చెప్పేస్తున్నారు. తనలో మొహమాటాన్ని వదిలించేసుకున్నారు. గతంలో ఎన్నడూ చూడని చంద్రబాబును చూస్తున్నామని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

అంగబలానికి, అర్థబలానికి లోటులేకుండా..
అధికారంలో లేనంతమాత్రాన అంగబలానికి, అర్థబాలానికి లోటులేదని టీడీపీ నిరూపిస్తోంది. రాష్ట్రం నలువైపుల నుంచి వస్తున్న చందాలతో కార్యక్రమాలన్నీ హంగు, ఆర్భాటంగా జరుగుతున్నాయి. నిధులు కూడా స్వచ్ఛందంగా వస్తుండటంతో ప్రభుత్వంపై ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థమవుతోందని, తన రాజకీయ జీవితంలో మూడు సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని చూడలేదని చంద్రబాబునాయుడు అంటున్నారు. ఇదే జోష్‌ను కొనసాగిస్తూ అధికారం కైవసం చేసుకునే దిశగా పరుగులు తీస్తున్న సైకిల్‌ను అడ్డుకునేవారే లేరని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.